అతిథులకు ఆతిథ్యం కరువు
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:21 PM
మండల కేంద్రానికి వచ్చే ఉన్నతాధికారులు, వీఐపీలకు ఆతిథ్యమివ్వాల్సిన జిల్లా పరిషత్ అతిథి గృహం అధ్వానంగా తయారై నిరుపయోగంగా ఉంది. ఎటువంటి మరమ్మతులకు నోచుకోక ఏడేళ్లుగా ఉపయోగంలో లేకుండా ఉంది. దీంతో కొయ్యూరు పర్యటనకు వచ్చే ఉన్నతాధికారులకు వసతి కల్పించలేని పరిస్థితి నెలకొంది.
నిరుపయోగంగా జడ్పీ అతిథి గృహం
గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయకపోవడంతో మరమ్మతులకు గురైన భవనం
ఆధునికీకరణ కోసం తాజాగా జడ్పీకి అధికారుల ప్రతిపాదనలు
కొయ్యూరు, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి వచ్చే ఉన్నతాధికారులు, వీఐపీలకు ఆతిథ్యమివ్వాల్సిన జిల్లా పరిషత్ అతిథి గృహం అధ్వానంగా తయారై నిరుపయోగంగా ఉంది. ఎటువంటి మరమ్మతులకు నోచుకోక ఏడేళ్లుగా ఉపయోగంలో లేకుండా ఉంది. దీంతో కొయ్యూరు పర్యటనకు వచ్చే ఉన్నతాధికారులకు వసతి కల్పించలేని పరిస్థితి నెలకొంది.
కొయ్యూరు జిల్లా పరిషత్ అతిఽథి గృహాన్ని 1972లో అప్పటి కలెక్టర్ సి.అర్జునరావు ప్రారంభించారు. అనంతరం ఈ భవనాన్ని 2017లో అప్పటి జడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని రూ.15 లక్షలతో ఆధునికీకరించారు. ఈ అతిఽథి గృహంలో విడిది చేసేందుకు వీలుగా ఒక సువిశాల గదితో పాటు ప్రత్యేక సూట్, డైనింగ్ హాల్ ఉన్నాయి. ఈ భవన నిర్వహణకు గతంలో ప్రతీ సంవత్సరం కొంత మేర జిల్లా పరిషత్ నుంచి నిధులు మంజూరయ్యేవి. వాటితో రంగులు, టైల్స్, మరుగుదొడ్ల మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయలేదు. దీంతో నిర్వహణ లేక సూట్ గదిలోని ఫర్నిచర్ పూర్తిగా పాడైపోయింది. విద్యుత్ ఉపకరణాలు పనిచేయడం లేదు. విద్యుత్ తీగలు వేలాడు తున్నాయి. మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఆరు నెలల క్రితం జిల్లా పరిషత్ సీఈవో మండల పర్యటను వచ్చినప్పుడు ఈ అతిథి గృహం పరిస్థితిని ఆయన దృష్టికి స్థానిక ఎంపీడీవో తీసుకువెళ్లగా మరమ్మతులకు గాను రూ.5 లక్షలు మంజూరు చేశారు. అయితే ఇచ్చిన నిధులు ఎటూ సరిపడకపోవడంతో ఆ నిధులు ఖర్చు చేయకుండా అదనంగా మరో రూ.10 లక్షలు అవసరమని పేర్కొంటూ స్థానిక మండల ఇంజనీరింగ్ అధికారి జిల్లా పరిషత్‌కు ప్రతిపాదనలు పంపారు. ఆ నిధులు మంజూరు కాకపోవడంతో ఈ భవనం మరమ్మతులకు నోచుకోలేదు. కాగా ఈ అతిథి గృహం వాచ్‌మన్‌కు పన్నెండేళ్లుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదు. అయినా అతిథి గృహం ఆవరణలోనే ఉంటూ పరిసరాలను శుభ్రం చేస్తూ వేతనాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అతిథి గృహాన్ని ఆధునికీకరించి అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.