వేధిస్తున్న అధికారుల కొరత
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:46 AM
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలను అధికారుల కొరత వేధిస్తోంది.
పలు శాఖల్లో ఇన్‌చార్జిలే దిక్కు
హౌసింగ్ పీడీగా ఈఈకి అదనపు బాధ్యతలు
జలవనరులశాఖ ఎస్‌ఈగా విజయనగరం జిల్లా ఈఈ
విద్యాశాఖలో ఎనిమిది ఎంఈవో పోస్టులు ఖాళీ
రెండు డివిజన్లకు ఒక్కరే డిప్యూటీ డీఈవో
పౌరసరఫరాల శాఖలో ఒక్కరే ఏఎస్‌వో
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలను అధికారుల కొరత వేధిస్తోంది. కొన్ని శాఖల్లో పదోన్నతులకు న్యాయపరమైన చిక్కులు ఎదురవడం, మరికొన్ని శాఖల్లో పోస్టింగ్‌లు లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ఆయా శాఖల ప్రగతిపై ప్రభావం పడుతోంది. దీనికితోడు జిల్లాలో ప్రొటోకాల్ భారం ఎక్కువవడంతో ఇక్కడకు వచ్చేందుకు ఇతర జిల్లాల అధికారులు వెనుకాడుతున్నారనే వాదన వినిపిస్తోంది.
వెనుబడిన ఇళ్ల నిర్మాణాలు
రాష్ట్రంలో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో సెంటు భూమిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల్సిన గృహనిర్మాణ సంస్థను ఏళ్లుగా అధికారుల కొరత వెంటాడుతోంది. జిల్లాలోని 65 కాలనీల్లో సుమారు లక్ష ఇళ్లు, రెగ్యులర్ స్కీమ్‌ల కింద మరిన్ని నిర్మాణాలు పర్యవేక్షించే ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్ల క్రితం రెగ్యులర్ పీడీ పి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ తరువాత ఈఈ ఆళ్ల శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తరువాత డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు ఏడాదికిపైగా పనిచేసి బదిలీ కావడంతో భీమిలి ఈఈ సూరిబాబుకు బాధ్యతలు అప్పగించారు. అతను టెక్కలి నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి భీమిలి ఈఈగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు.
నీరుగారుతున్న జల వనరుల శాఖ
జలవనరులశాఖ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ పోస్టులో రెండేళ్లుగా ఇతర జిల్లాల అధికారులను ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తున్నారు. తొలుత నార్త్‌కోస్ట్ సీఈ, ఎస్‌ఈ పోస్టుల్లో రాంగోపాల్ ఒక్కరే ఉన్నారు. అతను ఉద్యోగ విరమణ చేయడంతో ధవళేశ్వరం సర్కిల్ ఎస్‌ఈని ఇన్‌చార్జిగా నియమించారు. అక్కడి నుంచి వచ్చి పనిచేయడం సాధ్యంకాదని చెప్పడంతో, విజయనగరం జిల్లా తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు ఈఈ పీలా అప్పలనాయుడుకు బాధ్యతలు అప్పగించారు.
విద్యాశాఖలోనూ అంతే
జిల్లా విద్యాశాఖను అధికారుల కొరత వేధిస్తోంది. పూర్తిస్థాయిలో మండల విద్యాశాఖాధికారులు లేరు. ప్రతి మండలానికి ఇద్దరేసి ఎంఈవోలు ఉండాలి. మొత్తం 11 మండలాల్లో పద్మనాభం, ఆనందపురం, గాజువాక, పెదగంట్యాడ, మహారాణిపేట, సీతమ్మధార ఎంఈవో-1 పోస్టులు, భీమిలి, గోపాలపట్నం ఎంఈవో-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. విశాఖ, భీమిలి డివిజన్‌లకు ఉప విద్యాశాఖాధికారి పోస్టులున్నాయి. గోపాలపట్నం ఎంఈవో -1 సోమేశ్వరరావు విశాఖ డిప్యూటీ డీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భీమిలి డిప్యూటీ డీఈవో పోస్టుకు ఆర్థికశాఖ అనుమతి లేకపోవడంతో ఆ బాధ్యతలూ అతనిపైనే పడ్డాయి.
మూడు సర్కిళ్లకు ఒక్కరే...
జిల్లా పౌరసరఫరాల శాఖకు నగరంలో మూడు సర్కిళ్లుండగా సర్కిల్-2 సహాయ పౌరసరఫరాల అధికారిగా కల్యాణి పనిచేస్తున్నారు. సర్కిల్-1 ఏఎస్‌వో శ్రీహరి ఉద్యోగ విరమణచేయగా సర్కిల్-3 ఏఎస్‌వో కృష్ణ ఏడాది క్రితం ఏసీబీకి చిక్కడంతో ఆ బాధ్యతలు శ్రీహరి చూసేవారు. ఆయన ఉద్యోగ విరమణతో రెండుసర్కిళ్లకు అధికారులు లేరు. జిల్లా కార్యాలయంలో ఏఎస్‌వో పోస్టు ఖాళీ. రెవెన్యూ నుంచి నలుగురు డిప్యూటీ తహశీల్దార్లను బదిలీచేస్తే ముగ్గురు కలెక్టరేట్‌లోనే పనిచేస్తున్నారు. నగరంలో జరిగే పెద్ద ఈవెంట్లకు లక్షల్లో ఆహార ప్యాకెట్లు, స్నాక్స్ సరఫరాచేసే బాధ్యత పౌరసరఫరాలశాఖకు అప్పగిస్తుంటారు. మూడు సర్కిళ్లల్లో 450 డిపోల పర్యవేక్షణ, జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలతో పనిభారం పెరిగి ఉన్న సిబ్బంది ఉక్కిరిబిక్కిరవుతున్నారు.