కొరవడిన సమన్వయం
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:42 AM
నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో వైస్‌చైర్మన్ల ఎన్నికలు సోమవారం అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడడం కూటమి శ్రేణుల్లో చర్చకు దారితీసింది.
టీడీపీ-జనసేన మధ్య బహిర్గతమైన విభేదాలు
వైస్‌చైర్మన్ పదవులు ఎలమంచిలిలో టీడీపీకి, నర్సీపట్నంలో జనసేనకు కేటాయింపు
ఎలమంచిలిలో జనసేనతోపాటు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు
నర్సీపట్నంలో ప్రమాణ స్వీకారం అనంతరం బయటకువెళ్లిపోయిన టీడీపీ సభ్యులు
రెండుచోట్లా కోరం చాలకపోవడంతో వైస్‌చైర్మన్ ఎన్నికలు వాయిదా
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో వైస్‌చైర్మన్ల ఎన్నికలు సోమవారం అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడడం కూటమి శ్రేణుల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రస్థాయిలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నేతలు కలిసి పనిచేస్తున్నప్పటికీ.. ఈ రెండు మునిసిపాలిటీల్లో స్థానిక నేతల మధ్య అంతర్గత విభేదాల కారణంగా పొత్తు ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం మునిసిపల్ వైస్‌చైర్మన్ల ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపట్ల మూడు పార్టీల శ్రేణులు కలత చెందుతున్నారు.
ఎలమంచిలిలో జనసేన గైర్హాజరు
ఎలమంచిలి మునిసిపల్ ప్రత్యేక సమావేశాన్ని ఎన్నికల అధికారి, అడ్డరోడ్డు ఆర్డీఓ వెంకట రామలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ నిర్వహించారు. ఛైర్‌పర్సన్ పిల్లా రమాకుమారితో పాటు టీడీపీ, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. జనసేన, వైసీపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. దీంతో ప్రిసైడింగ్ అధికారి తొలుత చైర్‌పర్సన్‌తో, తరువాత టీడీపీ, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసినా... జనసేనకు చెందిన 11 మంది, వైసీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు హాజరుకాలేదు. దీంతో కోరం చాలకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
రాష్ట్రస్థాయిలో పదవుల సర్దుబాటులో భాగంగా ఎలమంచిలి మునిసిపల్ వైస్‌చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో ఆ పార్టీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ గొర్లె నానాజీ పేరును ప్రకటించారు. సోమవారం ఉదయం ఆయనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఏపీఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కలిసి బీ ఫారం అందించారు. మునిసిపల్ ఎన్నికల నామినేషన్లకు ముందు చైర్‌పర్సన్ పదవికి జనసేన తరపున కర్రి ఝాన్సీ చేత ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నామినేషన్ వేయించారు. అయితే పొత్తులో భాగంగా చైర్‌పర్సన్ పదవిని బీజేపీకి కేటాయించడంతో కర్రి ఝాన్సీ జనసేన తరపున ఒకటో వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు. ఈమెకు వైస్‌చైర్మన్ పదవిని ఇప్పించాలని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ భావించారు. అనూహ్యంగా వైస్‌చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. మునిసిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లలో టీడీపీకి 12 మంది, జనసేనకు 11 మంది, వైసీపీకి ఆరుగురు, బీజేపీకి ఇద్దరు కౌన్సిలర్లు వున్నారు. ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వైస్‌చైర్మన్ పదవిని టీడీపీకి ఇవ్వడం ఇష్టంలేని జనసేన నేతలు.. వైసీపీ నేతలతో మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతున్నది. జనసేన, వైసీపీలకు మొత్తం 17 మంది కౌన్సిలర్లు వున్నారు. అటు టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్‌తో కలిపి 15 మంది మాత్రమే వున్నారు. చైర్‌పర్సన్‌తోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వుంటుంది. మొత్తం 34 మందికిగాను 17 మంది హాజరైతేనే కోరం వున్నట్టు లెక్క. కానీ వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించే సమయానికి 16 మంది మాత్రమే వున్నారు. జనసేన కౌన్సిలర్లు వ్యూహాత్మకంగానే గైర్హాజరయ్యారన్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
నర్సీపట్నంలో మరో ట్విస్ట్
నర్సీపట్నం మునిసిపాలిటీలో కూడా వైస్‌చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడి వైస్‌చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ మేరకు 13వ వార్డు కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసి బీ ఫారం జారీ చేసింది. అయితే చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి ప్రమాణస్వీకారం అనంతరం టీడీపీ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవడం, జనసేన అభ్యర్థి బీఫారం సమర్పణలో ఆలస్యం జరగడంతో ఎన్నికల అధికారి వైస్‌చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఇక్కడ టీడీపీ, జనసేన నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలే ఈ పరిణామాలకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.