Share News

కృష్ణాపురం పర్యాటక ప్రాజెక్టు ఇక ‘పైనరీ’

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:31 PM

మండలంలోని కృష్ణాపురంలో అటవీశాఖ అతిథుల కోసం ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాజెక్టు వనవిహారి పేరును ‘పైనరీ’గా అధికారులు మార్పు చేశారు.

కృష్ణాపురం పర్యాటక ప్రాజెక్టు ఇక ‘పైనరీ’
పైనరీగా రూపుదిద్దుకున్న అటవీశాఖ పర్యాటక ప్రాజెక్టు వనవిహారి ముఖద్వారం

చింతపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణాపురంలో అటవీశాఖ అతిథుల కోసం ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాజెక్టు వనవిహారి పేరును ‘పైనరీ’గా అధికారులు మార్పు చేశారు. కృష్ణాపురంలో అటవీశాఖ కూటమి ప్రభుత్వ సహకారంతో పర్యాటకులకు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇక్కడ సందర్శకుల కోసం పది డబుల్‌, 15 సింగిల్‌ టెంట్లు, వాష్‌రూమ్‌, మరుగుదొడ్లు, గార్డెన్‌, నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ పాత్‌తో పాటు కేఫ్‌టేరియా అందుబాటులో ఉన్నాయి. తాజాగా సెమీ కాటేజీల నిర్మాణం జరుగుతోంది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పర్యాటక ప్రాజెక్టును ఇప్పటి వరకు అటవీశాఖ ఈటీఐ, వనవిహారి అని పిలిచేవారు. అయితే ఈ ప్రాజెక్టు పైన్‌ తోటల మధ్య ఉండడంతో ‘పైనరీ’గా నామకరణం చేశామని సబ్‌ డీఎఫ్‌వో వైవీ నరసింహరావు, రేంజ్‌ అధికారి బి.అప్పారావు తెలిపారు. ప్రధాన ద్వారంలో కృష్ణాపురం పైనరీ అని భారీ బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే ఆన్‌లైన్‌, గూగుల్‌లోనూ పైనరీ అని సెర్చ్‌ చేసేందుకు అనువుగా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jan 06 , 2026 | 11:31 PM