Share News

కృష్ణంపాలెం ఉద్రిక్తత

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:56 AM

మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి కోసం సేకరించిన కృష్ణంపాలెం గ్రామంలో ఇళ్ల తొలగింపును స్థానికులు అడ్డుకున్నారు. తమకు పునరావాసం కల్పించి, సమస్యలను పరిష్కరించే వరకు గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఇళ్లు కూల్చివేతకు అధికారులు తీసుకువచ్చిన ఎక్స్‌కవేటర్ల ముందు బైఠాయించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు.

కృష్ణంపాలెం ఉద్రిక్తత
తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఎక్స్‌కవేటర్‌ ముందు కూర్చొని రోదిస్తున్న నిర్వాసిత మహిళలు

గ్రామాన్ని ఖాళీ చేయించడానికి ఎక్స్‌కవేటర్లతో వచ్చిన అధికారులు

ఇళ్ల కూల్చివేతకు యత్నం

తీవ్రంగా ప్రతిఘటించిన నిర్వాసితులు

పునరావాసం కల్పించే వరకు ఇళ్లను ఖాళీ చేసేది లేదని విస్పష్టం

రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం

రాంబిల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి కోసం సేకరించిన కృష్ణంపాలెం గ్రామంలో ఇళ్ల తొలగింపును స్థానికులు అడ్డుకున్నారు. తమకు పునరావాసం కల్పించి, సమస్యలను పరిష్కరించే వరకు గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఇళ్లు కూల్చివేతకు అధికారులు తీసుకువచ్చిన ఎక్స్‌కవేటర్ల ముందు బైఠాయించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు.

అంతకుముందు పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ, ఎస్‌ఈజడ్‌ కోసం 18 సంవత్సరాల క్రితం పంట భూములు, ఉన్న ఊరును త్యాగం చేశామని, కానీ ఇంతవరకు తమ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని, ఇప్పుడు బలవంతంగా గ్రామాన్ని ఖాళీ చేయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదని, పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పారు. ఇవేమీ అమలు చేయకుండా రెవెన్యూ అధికారులు ఏడాది నుంచి తమను బలవంతంగా ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పునరావాసం కల్పించకుండా ఇళ్లను ఖాళీ చేయిస్తే.. తాము ఎక్కడ తలదాచుకోవాలో అధికారులే చెప్పాలని అన్నారు. ఇటు వ్యవసాయం లేక, అటు తాము ఇచ్చిన భూముల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యలన్నీ పరిష్కరించిన తరువాత గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని గతంలో చెప్పిన అధికారులు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, ఎంపీ సీఎం రమేశ్‌ స్పందించి తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని, అంతవరకు గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - Jan 26 , 2026 | 12:56 AM