కొయ్యూరు టూ కోల్‌కతా
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:00 PM
మన్యంలోని కొయ్యూరు నుంచి తాటిచెట్లు కోల్‌కతాకు రవాణా జరుగుతోంది. ఒక తాటిచెట్టును రూ.300 నుంచి రూ.500లకు వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులకు ఆదాయం వస్తోంది. గత నాలుగు నెలలుగా ఈ వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. ఇక్కడ కొనుగోలు చేసిన తాటిచెట్లు అక్కడ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.
తాటి దూలాలు రవాణా
తాటి చెట్టు రూ.300 నుంచి రూ.500
రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు
అక్కడి పారిశ్రామిక అవసరాలకు తరలింపు
నాలుగు నెలలుగా సాగుతున్న వ్యాపారం
కొయ్యూరు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కొయ్యూరు నుంచి కోల్‌కతాకు తాటిదూలాలు రవాణా అవుతున్నాయి. పొలాల్లో ఉన్న చేవ గల తాటిచెట్లను వ్యాపారులు కొనుగోలు చేసి లారీల్లో తరలిస్తున్నారు. దీంతో రైతులకు ఆదాయం వస్తోంది. పక్కా గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు సహకారమందిస్తుండడంతో గతంలో మాదిరి తాటాకు ఇళ్ల నిర్మాణాలకు స్థానికులు స్వస్తి పలికారు. ఇప్పటికే 90 శాతం వరకు పక్కా గృహాలు నిర్మించుకున్నారు. దీంతో తాటికమ్మలు, తాటి దూలాలు అవసరం లేకపోవడంతో భూముల్లోని తాటిచెట్లను రైతులు నరకడం మానేశారు. అయితే ఇదే సమయంలో కోల్‌కతా పరిసర ప్రాంతాలకు చెందిన వారు కోళ్ల ఫారాలు, డెయిరీ, తదితర షెడ్ల నిర్మాణాలకు ఈ ప్రాంతంలోని తాటిచెట్లు కొనుగోలుకు సిద్ధపడ్డారు. బాగా చేవ గలిగిన తాటిచెట్టును రూ.300 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొందరు రైతులు తాటిచెట్లను ఉచితంగానే ఇచ్చేస్తున్నారు. దీంతో కోల్‌కతా వ్యాపారులు గడిచిన మూడు, నాలుగు నెలల నుంచి గ్రామగ్రామాన తిరుగుతూ తాటిచెట్లను కొనుగోతు చేసి, యంత్రాలతో అవసరమైన సైజులలో దూలాలుగా తయారు చేసుకుని లారీలలో కోల్‌కతా తరలిస్తున్నారు.
పారిశ్రామిక అవసరాలకు..
ఒకప్పుడు పల్లెల్లో ఇళ్ల పైకప్పుకే పరిమితమైన తాటిచెట్టు ప్రస్తుతం పారిశ్రామిక అవసరాలకు కల్పతరువుగా మారింది. ఇక్కడి తాటి దూలాలను కోల్‌కతాలోని కోళ్లఫారం యజమానులు, డెయిరీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉష్ణోగ్రత నియంత్రణ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి తాటి కలపకు ఉండడమే కాకుండా దశాబ్దాల మన్నిక ఉంటుంది. దీంతో కొయ్యూరు నుంచి కోల్‌కతాకు తాటికలప రవాణా అవుతోంది. ఇక్కడ నుంచి రవాణాకే ఒక లారీ లోడుకు రూ.80 వేలను వ్యాపారులు ఖర్చు చేస్తున్నారు. దీనిని బట్టి తాటికలప వ్యాపారం ఏ స్థాయిలో లాభం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వందలాది తాటిచెట్లు నరికివేతకు గురవుతున్న తరుణంలో వీటి స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే జాతి మొక్కలు నాటాలని పలువురు సూచిస్తున్నారు.