Share News

కొయ్యూరు తహశీల్దార్‌ హఠాన్మరణం

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:24 PM

విధులకు హాజరయ్యేందుకు కారులో వస్తున్న కొయ్యూరు తహశీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌(55) మంగళవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లిన క్షణాల్లోనే హఠాన్మరణం చెందారు.

కొయ్యూరు తహశీల్దార్‌ హఠాన్మరణం
తహశీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌ (ఫైల్‌ ఫొటో)

విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా గుండెపోటు

పీహెచ్‌సీలోకి వెళ్లిన వెంటనే కుప్పకూలిన వైనం

కొయ్యూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): విధులకు హాజరయ్యేందుకు కారులో వస్తున్న కొయ్యూరు తహశీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌(55) మంగళవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లిన క్షణాల్లోనే హఠాన్మరణం చెందారు. దీనికి సంబంధించి వీఆర్‌వోలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఎప్పటిలాగానే నర్సీపట్నం నుంచి కారులో విధులకు హాజరయ్యేందుకు మంగళవారం ఉదయం తహశీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో కృష్ణాదేవిపేటలో ముగ్గురు వీఆర్‌వోలను కారులో ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం చింతాలమ్మఘాట్‌ వద్దకు వచ్చే సరికి ఆయనకు ఆయాసం రావడం ప్రారంభమైంది. దీనిని గుర్తించిన వీఆర్‌వోలు వైద్య సేవల కోసం తిరిగి నర్సీపట్నం వెళ్లిపోదామని తహశీల్దార్‌కు సూచించారు. అయితే కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉందని, అది చూసుకుని వెళదామని ఆయన బదులిచ్చారు. మరికొద్ది దూరం ప్రయాణించిన అనంతరం గురక ప్రారంభమైంది. దీంతో విషయాన్ని వీఆర్‌వోలు డీటీ కుమారస్వామికి తెలియజేశారు. వెంటనే ఆయనను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తీసుకువెళ్లాలని డీటీ సూచించారు. అయితే ఎలాగైనా తాను విధులకు హాజరవ్వాలని తహశీల్దార్‌ పట్టుబట్టి కార్యాలయానికి వెళ్లారు. కొద్ది సేపటికే ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే పీహెచ్‌సీకి తరలించారు. ఆయన కారు దిగి నడుచుకుంటూ పీహెచ్‌సీలోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయారు. ఆయనకు వైద్యాధికారి స్నేహలత సుమారు అర్ధగంట పాటు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తహశీల్దార్‌ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. తహశీల్దార్‌ ప్రసాద్‌కు భార్య సుజాతతో పాటు కుమారుడు అఖిల్‌, కుమార్తె నవ్య ఉన్నారు. పండుగకు హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు భార్యతో కలిసి వెళ్లిన ఆయన సోమవారం ఉదయమే నర్సీపట్నం వచ్చినట్టు డ్రైవర్‌ తెలిపాడు. ప్రస్తుతం భార్య, కుమార్తె హైదరాబాద్‌లో ఉండగా, కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. వారికి సమాచారం అందడంతో తమ స్వస్థలమైన రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరానికి ప్రసాద్‌ పార్థివదేహాన్ని పంపాలని కోరడంతో అంబులెన్స్‌లో అక్కడికి తరలించారు. కలెక్టర్‌, ఇన్‌చార్జి జేసీ ఆదేశాల మేరకు ఆర్‌డీవో ఎంవీఎస్‌ లోకేశ్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏవో కె.ప్రసాదరావు కొయ్యూరు వచ్చి ప్రసాద్‌ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

కింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి..

1970లో జన్మించిన ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌ 1990లో నర్సీపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 2001లో ఆర్‌ఐగా పదోన్నతి పొంది నాతవరం, గొలుగొండ మండలాల్లో పనిచేశారు. 2018లో హెచ్‌డీటీగా పదోన్నతి పొంది హుకుంపేట, గొలుగొండ మండలాల్లో పనిచేసి, 2019లో ఇనాం డీటీగా తిరిగి నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేశారు. 2020లో తహశీల్దార్‌గా పదోన్నతి పొంది విజయనగరం జిల్లా కొమరాడలో పని చేశారు. అనంతరం 2022లో పాడేరు డివిజన్‌ జీకే వీధి తహశీల్దార్‌గా పనిచేస్తూ చింతపల్లి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 అక్టోబరు నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో కొయ్యూరు తహశీల్దార్‌గా విధుల్లో చేరారు.

Updated Date - Jan 20 , 2026 | 11:24 PM