శ్రావణికే సీటు
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:32 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ప్రకటన జారీచేసింది.
జీవీఎంసీ మేయర్ అభ్యర్థినిగా ఖరారు చేసిన కూటమి
వృత్తి రీత్యా ఫిజియోథెరపీ డాక్టర్
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ముక్కా కుటుంబం
గత ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నిక
విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ప్రకటన జారీచేసింది. ఆమె పేరు మొదటి నుంచీ ప్రచారంలో ఉంది. ఎంపీ శ్రీభరత్ ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఎంపీ తాత ఎంవీవీఎస్ మూర్తికి శ్రావణి తండ్రి ముక్కా ముత్యాలనాయుడు ముఖ్య అనుచరుడిగా కొనసాగారు.
తెలుగుదేశం ఆవిర్భావం (1983) నుంచి ముక్కా ముత్యాలనాయుడు పార్టీతోనే ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడు గతంలో కార్పొరేటర్‌గా గెలిచారు. ఆయన భార్య ఈశ్వరి టీడీపీ తరపున 2007 ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముక్కా శ్రావణి 2015లో పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. 2021 ఎన్నికల్లో ఆమె 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కుటుంబం కావడంతో అధిష్ఠానం వారిని గుర్తించింది. శ్రావణి వృత్తి రీత్యా ఫిజియోథెరపీ డాక్టర్. ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఆమె సోదరుడు కిశోర్ కుమార్ 2005 నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
పార్టీ విధేయత, సామాజిక సమీకరణకు ప్రాధాన్యం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జీవీఎంసీ మేయర్ అభ్యర్థినిగా ముక్కా శ్రావణి ఎంపిక విషయంలో ప్రధానంగా పార్టీ పట్ల విధేయత, సామాజిక సమీకరణను పరిగణనలోకి తీసుకున్నారు. మేయర్ అభ్యర్థిత్వానికి శ్రావణితోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ సతీమణి సుజాత, ‘వరుణ్’ ప్రభుకిశోర్ సతీమణి లక్ష్మీ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోడలు నందినితోపాటు మరికొందరు తటస్థుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరకు శ్రావణి, లొడగల సుజాత పేర్లపై గురువారం అధిష్ఠానం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మరోవైపు జీవీఎంసీ పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంది. అనేక తర్జనభర్జనల అనంతరం చివరికి శ్రావణి పేరు ఖరారుచేశారు.
74 మంది అభ్యర్థులతో వైసీపీ తొలిజాబితా
విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఆ పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సంయుక్తంగా 74 వార్డులకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణిని ఇప్పటికే ప్రకటించిన అధిష్ఠానం, తాజాగా 74 వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగిలిన 46 వార్డులకు అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వార్డు అభ్యర్థులపై టీడీపీ అభిప్రాయ సేకరణ
విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక కోసం తెలుగుదేశం అధిష్ఠానం శుక్రవారం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టింది. మీ వార్డులో ఫలానా వారిని అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు సమ్మతమేనా?...అంటూ కాల్స్ వచ్చాయి. మరికొన్ని వార్డుల వారికి ఇద్దరు పేర్లు చెప్పి, వారిలో ఎవరు సరైన అభ్యర్థి...సూచించాలని కోరడం జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు సుమారు 60 నుంచి 70 వార్డుల్లో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట సగం వార్డులు ఆయా పార్టీలకు కేటాయిస్తారు.
మేయర్ పదవికి తొలిరోజు నామినేషన్లు నిల్
కార్పొరేటర్ పదవులకు 68 నామినేషన్లు
అత్యధికంగా గాజువాక జోన్లో 26...
విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్ పదవికి తొలిరోజైన శుక్రవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు. కార్పొరేటర్ పదవులకు మాత్రం జీవీఎంసీ పరిధిలో 68 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గాజువాక జోన్లో 26 నామినేషన్లు దాఖలు కాగా, భీమిలి, మధురవాడ, అనకాపల్లి జోన్ల పరిఽధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈస్ట్‌జోన్ పరిధిలో నాలుగు, సౌత్‌జోన్ పరిధిలో 13, నార్త్‌జోన్ పరిధిలో ఏడు, వెస్ట్ జోన్ పరిధిలో మూడు, గాజువాక జోన్ పరిధిలో 26, అగనంపూడి జోన్ పరిధిలో తొమ్మిది, పెందుర్తి జోన్ పరిధిలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి.
నేడు వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి నామినేషన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు, కార్యాకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలుచేయడానికి ఏర్పాట్లుచేసుకుంటున్నారు.