Share News

బీజుమరవలసలో కొండపోడు వివాదం

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:08 PM

కొండపోడు సాగు వివాదంలో గిరిజన మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని బీజుమరవలసలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బీజుమరవలసలో కొండపోడు వివాదం
హత్యాయత్నానికి గురైన బిమ్ల

నాటు తుపాకితో కాల్పులు

గిరి మహిళపై హత్యాయత్నం

డుంబ్రిగుడ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బీజుమరవలస గ్రామానికి చెందిన కిల్లో బిమ్ల భర్త అనారోగ్యంతో మృతి చెందారు. వారసత్వంగా చేస్తున్న కొండపోడు వ్యవసాయానికి సంబంధించి కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన కిల్లో లక్ష్మణరావుతో వివాదం కొనసాగుతున్నది. శనివారం ఉదయం గిరిజన మహిళ బీమ్ల తన కుమార్తెతో కలిసి కొండపోడు వ్యవసాయం చేసుకునేందుకు వెళ్లింది. దీనిపై ఆగ్రహంతో లక్ష్మణరావు తల్లీకుమార్తెలతో గొడవకు దిగాడు. అనంతరం వారిద్దరిపై నాటు తుపాకితో కాల్పులు జరపారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత మహిళ శరీరంలోని బుల్లెట్లు దిగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో అరకులోయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బీమ్ల పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారని వైద్యులు తెలిపారు.

Updated Date - Apr 18 , 2026 | 11:08 PM