Share News

కొండకర్ల ఆవకు మహర్దశ

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:48 AM

అచ్యుతాపురం, మునగపాక మండలాలకు విస్తరించి ఉన్న కొండకర్ల ఆవకు మహర్దశ పట్టనుంది.

కొండకర్ల ఆవకు మహర్దశ

పరిరక్షణ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

29, 30 తేదీల్లో ఉత్సవాలు

బోటింగ్‌, స్థానిక ఉత్పత్తులపై స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు

అచ్యుతాపురం జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

అచ్యుతాపురం, మునగపాక మండలాలకు విస్తరించి ఉన్న కొండకర్ల ఆవకు మహర్దశ పట్టనుంది. దీనిని ప్రాశస్త్యాన్ని గుర్తించి ‘వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్టు-1972’ కింద పరిరక్షణ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. తాజాగా అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా రెండు రోజులపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఉత్తరాంధ్రలో అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొండకర్ల ఆవ.. 1,863 ఎకరాల విస్తీర్ణం, 14 కిలోమీటర్ల వైశాల్యం కలిగి వుంది. నీటి నిల్వ సామర్థ్యం 180.9 మిలియన్‌ ఘనపుటడుగులు. ఆవ ఆయకట్టు సుమారు రెండు వేల ఎకరాలు. శరదా నది నుంచి కృష్ణంరాజు కాలువ ద్వారా ఆవలోకి వర్షం నీరు చేరుతుంది. ఆవలో నిండితే కళింగ లాకుల ద్వారా దిగువకు పోతుంది. ఆవ పూర్తిగా నిండితే సుమారు 20 అడుగుల లోతున నీరు వుంటుంది. సుమారు 200 మత్స్యకార కుటుంబాలు ఆవలో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నాయి. కాగా కొండకర్ల ఆవలో సుమారు వంద ఎకరాలు ఆక్రమణకు గురయాయి. కబ్జాదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై కొంతమందికి డి.పట్టాలు సైతం జారీ చేశారు. రాజకీయ పలుకుబడితో మరికొందరు డి.పట్టాలు పొందారు.

పర్యాటకంగా అభివృద్ధి

కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసింది. సెజ్‌లో ఒక కర్మాగారం సీఎస్‌ఆర్‌ నిధులతో కొండకర్ల ఆవను అభివృద్ధి చేస్తామని ఎంఓయూ చేసుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద ఆవగట్లను వెడల్పు చేయడంతోపాటు ఫలసాయాన్నిచ్చే చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించి కొంతమేర పనులు కూడా జరిగాయి. ఆవలో పూడిక తీయించి చేపల పెంపకంతోపాటు బోటు షికారు ఏర్పాటు చేయాలని, పర్యాటకుల వసతి కోసం రిసార్టు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇవి కార్యరూపం దాల్చలేదు. రిపేర్‌, రెనోవేషన్‌, రెస్టొరేషన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా ఆవను ఆధునీకరించడానికి అనకాపల్లి గత ఎంపీ సత్యవతి చొరవతో కేంద్ర ప్రభుత్వం 2021లో ముందుకొచ్చింది. కానీ జగన్‌ ప్రభుత్వం చొరవచూపకపోవటంతో అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక ప్రదేశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ జాబితాలో కొండకర్ల ఆవ కూడా వున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇదిలావుండగా ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవ్‌లో కొండకర్ల ఆవను కూడా చేర్చారు. రెండు రోజులపాటు ఇక్కడ బోటింగ్‌, జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:48 AM