శరవేగంగా కేకే లైన్ డబ్లింగ్ పనులు
ABN , Publish Date - Mar 08 , 2026 | 02:00 AM
దక్షిణ మధ్య రైల్వేకు రూ.కోట్లలో ఆదాయాన్ని సమకూర్చే కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ రెండో ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కరకవలస-బొర్రా స్టేషన్ మధ్య రూపుదిద్దుకుంటున్న టన్నెల్స్
సిమిలిగుడ-కరకవలస మధ్య జోరుగా డబ్లింగ్ పనులు
అరకులోయ, మార్చి7 (ఆంధ్రజ్యోతి):
దక్షిణ మధ్య రైల్వేకు రూ.కోట్లలో ఆదాయాన్ని సమకూర్చే కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ రెండో ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కిరండోల్ నుంచి సిమిలిగుడ వరకు డబుల్‌ట్రాక్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం సిమిలిగుడ నుంచి కరకవలస స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి.
బ్రిటిష్ కాలంలో ఐరన్‌ఓర్ జపాన్‌కు తరలించేందుకు వీలుగా వేసిన కొత్తవలస- కిరండోల్ రైల్వేలైన్ దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కిరండోల్ నుంచి విశాఖపట్నం పోర్టు వరకు నిత్యం ఐరన్‌ఓర్ తరలిస్తుంటారు. ఇది ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో రైల్వే శాఖ కేకే లైన్‌లో రెండో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇందులో భాగంగా కిరండోల్ నుంచి సిమిలిగుడ వరకు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.
అసలు పని ప్రారంభం
కేకే లైన్‌లో అత్యంత క్లిష్టమైన, కష్టతరమైన రైల్వే లైన్ కరకవలస నుంచి బొడ్డవర వరకు ట్రాక్ నిర్మాణం. గత ఏడాది ఈ పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా సిమిలిగుడ-కరకవలస రైల్వేస్టేషన్ల మధ్య భారీ వంతెనలు, కొండచరియలు విరిగిపడకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు. కరకవలస స్టేషన్ నుంచి బొడ్డవర వరకు సుమారు 11కిలోమీటర్ల మేర 48 రైల్వే టన్నెల్స్ ఉన్నాయి. పాత ట్రాక్ పక్క నుంచే రెండో లైన్ పనులు ప్రారంబించారు. ఆధునిక సాంకేతికను వినియోగించి కరకవలస- బొర్రాగుహలు స్టేషన్ వరకు పనులు చేపడుతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య సుమారు ఏడు టన్నెల్స్ ఉన్నాయి. బొర్రాగుహలు-తైడా స్టేషన్‌ల మధ్య సుమారు 12 కిలోమీటర్ల మేర ఒకే టన్నెల్ నిర్మించనున్నట్టు తెలిసింది. బొర్రాగుహలు-బొడ్డవర, సిమిలిగుడ, తైడా, శివలింగపురం, బొడ్డవర స్టేషన్‌ల మధ్య పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కొండలు, లోతైన ప్రాంతాల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాల్సి రావడంతో ఇవి పూర్తయ్యేందుకు సుమారు రెండేళ్ల సమయం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. డబుల్‌ట్రాక్ పనులు పూర్తిచేస్తే విశాఖపట్నం-అరకులోయ, కొరాపుట్-జైపూర్, జగదల్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. కిరండోల్ సమీపంలోని బైలదిల్లా గనుల నుంచి నిరంతరాయంగా ఐరన్‌ఓర్ తరలించేందుకు ఒక ట్రాక్‌ను పూర్తిగా వినియోగిస్తారని రైల్వేవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాయగడ రైల్వే డివిజన్‌కు ఊహించని ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.