Share News

చురుగ్గా కేకే లైన్‌ డబ్లింగ్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:38 AM

కొత్తవలస-కిరండోల్‌ (కేకే) రైలు మార్గంలో రెండో లైన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని ఐరన్‌ఓర్‌ గనుల నుంచి ముడిఇనుము తరలింపునకు బ్రిటిష్‌ కాలంలో ఈ రైలు మార్గం నిర్మించారు. విశాఖపట్నం శివార్లలోని కొత్తవలస వద్ద మొదలయ్యే ఈ మార్గం ఒడిశా గుండా చత్తీస్‌గఢ్‌ వరకు 445.5 కిలోమీటర్లు ఉంటుంది. తూర్పు కనుమల్లో కొండలను తవ్వి టన్నెళ్లు వేసి, నదులు, జలపాతాలపై బ్రిడ్జీలు నిర్మించి రైలు మార్గం వేశారు.

చురుగ్గా కేకే లైన్‌ డబ్లింగ్‌
బొర్రా గుహలు వద్ద కొండను తవ్వి టన్నెల్‌ నిర్మిస్తున్న దృశ్యం

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,500 కోట్లు

ఇప్పటికి 65 శాతం పనులు పూర్తి

మొన్నటివరూ వాల్తేరు డివిజన్‌లో...

ఇప్పుడు రాయగడ డివిజన్‌ పరిధిలోకి మార్పు

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):

కొత్తవలస-కిరండోల్‌ (కేకే) రైలు మార్గంలో రెండో లైన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని ఐరన్‌ఓర్‌ గనుల నుంచి ముడిఇనుము తరలింపునకు బ్రిటిష్‌ కాలంలో ఈ రైలు మార్గం నిర్మించారు. విశాఖపట్నం శివార్లలోని కొత్తవలస వద్ద మొదలయ్యే ఈ మార్గం ఒడిశా గుండా చత్తీస్‌గఢ్‌ వరకు 445.5 కిలోమీటర్లు ఉంటుంది. తూర్పు కనుమల్లో కొండలను తవ్వి టన్నెళ్లు వేసి, నదులు, జలపాతాలపై బ్రిడ్జీలు నిర్మించి రైలు మార్గం వేశారు. దీనికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అందుకు తగిన ఫలితం లభించడంతో ఐదు దశాబ్దాల తరువాత ఆ మార్గంలో రెండో రైలు మార్గం వేయాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దశాబ్దం క్రితం నిధులు మంజూరు కాగా అప్పటి నుంచి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దశల వారీగా నిర్మించుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు ఈ పనులు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం బొర్రా గుహల వద్ద జరుగుతున్నాయి. అక్కడి సమీపంలోని కొండను తవ్వి టన్నెల్‌ నిర్మిస్తున్నారు. ఇది రెండో లైన్‌లో 36వ టన్నెల్‌ అని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,500 కోట్లు. ఇప్పటికి 65 శాతం పనులు పూర్తయ్యాయి.

రాయగడ్‌ డివిజన్‌లోకి మార్పు

ఈ మార్గంలో బైలదిల్లా గనుల నుంచి ముడిఇనుము విశాఖపట్నం తీసుకువస్తున్నారు. ఇది మొన్నటి వరకు అంటే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకాక ముందు వరకు వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఉండేది. ముడి ఇనుము రవాణా ద్వారా ఏటా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. విశాఖపట్పం పోర్టు కూడా ఈ ముడిఇనుము ఎగుమతుల ద్వారానే అభివృద్ధి చెందింది. కొత్తగా విశాఖకు రైల్వే జోన్‌ మంజూరుచేసిన తరువాత ఈ కేకే లైన్‌ మార్గం ఒడిశా రాష్ట్రంలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటుచేసిన డివిజన్‌లోకి వెళ్లిపోయింది. ఆ ఆదాయం ఇప్పుడు రాయగడ డివిజన్‌ ద్వారా కేంద్ర రైల్వే ఖాతాలో జమ అవుతోంది.

Updated Date - Jul 19 , 2026 | 01:40 AM