చీకటి రాజ్యం
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:53 AM
నగరంలో వీధి దీపాల నిర్వహణ పూర్తిగా గాడితప్పింది.
వెలగని వీధి దీపాలు
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
అరకొర సిబ్బందితో నిర్వహణ పనులు
ఫిర్యాదులు అందుతున్నా జీవీఎంసీ అధికారులు మౌనం
ఉల్లంఘనలపై నోటీసులు ఇచ్చామంటూ సమాధానం
కాంట్రాక్టర్‌ను తొలగించబోతున్నట్టు కొన్ని నెలలు కిందట ప్రకటన
ఇప్పటికీ అదే సంస్థ కొనసాగింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో వీధి దీపాల నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. మరమ్మతులు సకాలంలో జరగడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం రాజ్యమేలుతోంది. జీవీఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేసి చేతులు దులిపేసుకుంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీ పరిధిలో గల 1.18 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణను రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన బ్రిడ్జి అండ్ రూఫ్ (బీ అండ్ ఆర్) సంస్థకు జీవీఎంసీ అప్పగించింది. ఇందుకోసం 98 వార్డుల్లో ఒక ఎలక్ర్టీషియన్‌తోపాటు హెల్పర్‌ను కాంట్రాక్టు సంస్థ నియమించుకోవాల్సి ఉంది. వీరితోపాటు ఒక్కో జోన్‌కు ఒక ఇంజనీర్, రాత్రిపూట వెలగని లైట్లు గుర్తించేందుకు పెట్రోలింగ్ సిబ్బంది, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత ప్రాంత సిబ్బందికి తెలియపరిచేందుకు వీలుగా కంట్రోల్‌రూమ్ వంటివి ఏర్పాటుచేసుకోవాలి. వీధి దీపాల నిర్వహణకుగాను కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ నెలకు రూ.1.16 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఎక్కడైనా వీధి దీపం వెలగడం లేదని ఫిర్యాదు అందితే 48 గంటల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలాచేయకలేకపోతే జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాలి. అయితే నగరంలో వీధి దీపాల నిర్వహణను సదరు కాంట్రాక్టర్ గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కౌన్సిల్ ఉన్నప్పడు కూడా ప్రతి కార్పొరేటర్ వీధి దీపాల సమస్యపైనే మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువస్తుండేవారు. చర్యలు తీసుకుంటామని సంబంధిత ఇఇంజనీరింగ్ అధికారులు కౌన్సిల్ సమావేశంలో సమాధానం ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండేది కాదు. కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో వీధి దీపాల సమస్యపై అధికారులను ప్రశ్నించేవారే లేకుండాపోయారు. ప్రజలు తమ ప్రాంతంలో వీధి లైలు వెలగడం లేదని పీజీఆర్‌ఎస్ లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేస్తే ఎప్పటికో సమస్య పరిష్కరిస్తున్నారు. అదే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే మాత్రం వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిన తర్వాత కాంట్రాక్టర్ పనితీరు మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అరకొర సిబ్బందితో కాంట్రాక్టర్ కాలక్షేపం
జీవీఎంసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా కాంట్రాక్టర్ అరకొర సిబ్బందితోనే కాలం నెట్టుకుస్తున్నారు. వీధిదీపాల సమస్య వస్తే పరిష్కరించేందుకు వార్డుకి ఇద్దరు చొప్పున ఉండాలి. కానీ సగం మంది కూడా లేరని పేర్కొంటున్నారు. ఉదాహరణకు సౌత్‌జోన్ పరిధిలో 12 వార్డులకు 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ, కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. అన్ని జోన్‌లలోనూ అదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. తగినంత మంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ దబాయిస్తున్నారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందికి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటివి కాంట్రాక్టర్ చెల్లించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో ఎంతమందికి కట్టారో బయటపెట్టాలని కోరితే కాంంట్రాక్టర్ ముఖం చాటేస్తున్నారు. సిబ్బంది హాజరును పర్యవేక్షించాల్సిన ఎలక్ర్టికల్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు ఈ విషయంపై నోరెత్తకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు
వీధి దీపాల నిర్వహణ సరిగా లేదని ప్రజలతోపాటు మాజీ కార్పొరేటర్లు నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా సరే అధికారులు మాత్రం మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్‌ను తొలగించేస్తామని ఆరు నెలల కిందటే అధికారులు ప్రకటించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. వీఽది దీపాల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నగరానికి చెందిన ఒకరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసింద నే ప్రచారం ఉంది. ఇలా సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లింపు జరుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తేవాలని లేనిపక్షంలో ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.