Share News

చీకటిరాజ్యం

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:08 AM

నగరంలో రాత్రివేళ చీకటి రాజ్యమేలుతోంది. చాలాచోట్ల వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారం అలముకుంటోంది.

చీకటిరాజ్యం

నగరంలో వెలగని వీధి లైట్లు

నిర్వహణలో కాంట్రాక్టర్‌ వైఫల్యం

అరకొర సిబ్బందితో కాలక్షేపం

లైట్లు వెలగడం లేదని ఫిర్యాదుల వెల్లువ

బిల్లు చెల్లింపును నిలిపేసిన అధికారులు

వీధి దీపాల నిర్వహణ ఆపేసిన కాంట్రాక్టర్‌

దీంతో సమస్య మరింత తీవ్రం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో రాత్రివేళ చీకటి రాజ్యమేలుతోంది. చాలాచోట్ల వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారం అలముకుంటోంది. నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ మరమ్మతులకు గురైన లైట్లను రోజుల తరబడి రిపేరు చేయడం లేదు. దీనిపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పరిస్థితి మారడం లేదని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు.

జీవీఎంసీ పరిధిలో సుమారు 1.18 లక్షల వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను జీవీఎంసీ కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ వస్తోంది. గతంలో ఢిల్లీకి చెందిన ఈఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థ ఎనిమిదేళ్లపాటు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించింది. రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన బీఎన్‌ఆర్‌ సంస్థకు అప్పగించింది. ఒప్పందం ప్రకారం ప్రతి వార్డులో వీధి దీపాలు వెలిగేలా చూసేందుకు ఒక హెల్పర్‌తోపాటు టెక్నీషియన్‌ను నియమించాలి. అలాగే వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా?, లేదా? అనేది రాత్రిపూట పరిశీలించేందుకు ఒక నైట్‌ పెట్రోలింగ్‌ పార్టీని జోన్‌ల వారీగా నియమించుకోవాలి. ఎక్కడైనా లైట్లు వెలగకపోతే వెంటనే విషయాన్ని ఆ పరిధిలోకి వచ్చే సైట్‌ ఇంజనీర్లకు తెలియజేస్తే వాటి మరమ్మతుకు తగిన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ కొత్త లైట్లు, వైర్లు అవసరమైతే వాటిని కాంట్రాక్టరే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా వీధి దీపం వెలగలేదని కార్పొరేటర్లుగానీ, ప్రజలుగానీ ఫిర్యాదు చేస్తే 48 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలి. లేనిపక్షంలో జీవీఎంసీయే ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని, కాంట్రాక్టర్‌ నుంచి జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. ఎన్ని లైట్లు వెలగకపోతే అంత మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు ఇచ్చే బిల్లులో రికవరీ చేయవచ్చు. కానీ టెండరు దక్కించుకున్న సంస్థ అగ్రిమెంట్‌ ప్రకారం పనిచేయడాన్ని విస్మరించింది. ఒప్పందం ప్రకారం ప్రతి వార్డుకు ఒక హెల్పర్‌ను, టెక్నీషియన్‌ను, నైట్‌ పెట్రోలింగ్‌ పార్టీని నియమించుకోకుండా అరకొర సిబ్బందితోనే కాలం నెట్టుకొస్తోంది. దీనివల్ల ఎక్కడ వీధి దీపాలు వెలగడం లేదో గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఒకవేళ స్థానికులు, కార్పొరేటర్లు అధికారుల ద్వారా కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా అవసరమైన టెక్నీషియన్లు, హెల్పర్‌లు లేక సమస్య పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతోంది. జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం, స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు జరిగినప్పుడల్లా వీధి దీపాల సమస్య గురించి సభ్యులు ప్రస్తావిస్తున్నారు. దీంతో అధికారులు సైతం కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా అటు వైపు నుంచి మాత్రం స్పందన ఉండడం లేదు. కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇస్తున్నామనే చెబుతున్నారు తప్పితే అధికారులు ర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో 24వ వార్డు కార్పొరేటర్‌ సాడి పద్మారెడ్డి, మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎక్కడికక్కడ అంధకారం

కాంట్రాక్టర్‌ నోటీసులకు స్పందించకపోవడంతో బిల్లు చెల్లింపును తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే బిల్లు ఇచ్చేంత వరకూ వీధి దీపాల నిర్వహణ చేయబోమని అధికారులకు కాంట్రాక్టర్‌ స్పష్టంచేశారు. కాంట్రాక్టర్‌ నిర్ణయంతో నగరంలో వీధి దీపాల సమస్య మరింత తీవ్రమైంది. నక్కవానిపాలెం, వెంకోజీపాలెం, సీతమ్మధార నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌, శివాజీపాలెం, అబిద్‌ నగర్‌ వంటి ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. దీనివల్ల రాత్రిపూట ఆయా ప్రాంతాల్లో చీకటి రాజ్యమేలుతోంది. జీవీఎంసీ కమిషనర్‌, మేయర్‌లు వెంటనే వీధి దీపాల నిర్వహణ చూసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 01:08 AM