Share News

మిరియాల రైతు ఖుషీ

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:13 PM

గిరిజన ప్రాంతంలో మిరియాల పంట ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది గతం కంటే అధిక దిగుబడులు వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మిరియాల రైతు ఖుషీ
ప్రభుత్వం పంపిణీ చేసిన అల్యూమినియం నిచ్చెనలతో గింజలు సేకరిస్తున్న గిరిజన రైతు

ఆశాజనకంగా పంట

గింజల సేకరణలో రైతన్న నిమగ్నం

ప్రాంతీయ మార్కెట్‌లో కిలో రూ.400-450 చొప్పున పలుకుతున్న ధర

చింతపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మిరియాల పంట ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది గతం కంటే అధిక దిగుబడులు వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీ రైతులు గింజల సేకరణ పనుల్లో నిమగ్నమయ్యారు.

జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు సాగుచేస్తున్నారు. కాఫీ తోటల్లో నీడనిచ్చే చెట్లకు మిరియాల మొక్కలను పాకించి దిగుబడులు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 96 వేల ఎకరాల్లో మిరియాల పంటను రైతులు సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా 3,900 మెట్రిక్‌ టన్నుల మిరియాల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మరో 500 మెట్రిక్‌ టన్నుల దిగుబడి అధికంగా వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మిరియాల సీజన్‌ ప్రారంభం కావడంతో గిరిజన రైతులు గింజల సేకరణ పనులు చేపడుతున్నారు. గతంలో ఆదివాసీ రైతులు వెదురు కర్రలతో ఏర్పాటుచేసుకున్న నిచ్చెనలతో చెట్లపైకి ఎక్కి గింజలను సేకరించేవారు. దీని వల్ల ప్రమాదాలకు గురయ్యేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అల్యూమినియం నిచ్చెనలను ఉచితంగా రైతులకు పంపిణీ చేసింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అల్యూమినియం నిచ్చెనల పంపిణీకి బ్రేక్‌ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వం అల్యూమినియం నిచ్చెనల పంపిణీని పునఃప్రారంభించింది. ప్రభుత్వం పంపిణీ చేసిన అల్యూమినియం నిచ్చెనలతో రైతులు సులభంగా మిరియాల దిగుబడులను సేకరించుకుంటున్నారు. కాగా మిరియా పంటకు ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి ధర లభిస్తున్నది. కేరళలోని ఎర్నాకులం(అంతర్జాతీయ) మార్కెట్‌లో కిలో నల్ల మిరియాలు ధర రూ.645 ధర లభిస్తున్నది. ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు రూ.400 నుంచి రూ.450 ధరలకు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ధర మరింతగా పెరిగే అవకాశముందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మిరియాల దిగుబడులు, ధర బాగుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 11:13 PM