Share News

గట్టెక్కిన ఖరీఫ్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:11 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు గట్టెక్కుతుందా? అని సందిగ్ధంలో ఉన్న గిరిజన రైతులను గత నెలలో కురిసిన భారీ వర్షాలు ఆదుకున్నాయి. ఈ వర్షాలు పంటలకు జీవం పోశాయి. దీంతో అనుకోని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.

గట్టెక్కిన ఖరీఫ్‌
పెదబయలు మండలం బంగారుమెట్ట ప్రాంతంలో వరి పంట

ఎల్‌నివో ప్రభావంలోనూ మన్యంలో అనుకూలంగా వానలు

జూన్‌, జూలై, ఆగస్టులో కంటే సెప్టెంబరులో భారీ వర్షాలతోనే పంటలకు జీవం

ఫలితంగా జిల్లాలో 24 శాతం పెరిగిన పంటల సాగు విస్తీర్ణం

గిరిజన రైతుల ఆనందం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు గట్టెక్కుతుందా? అని సందిగ్ధంలో ఉన్న గిరిజన రైతులను గత నెలలో కురిసిన భారీ వర్షాలు ఆదుకున్నాయి. ఈ వర్షాలు పంటలకు జీవం పోశాయి. దీంతో అనుకోని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.

గిరిజన ప్రాంతంలో కేవలం వర్షాధారంగానే పంటల సాగు చేపడతారు. దీంతో ఏదైనా కారణంతో వానలు పడకపోతే పంటలు చేతికందని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతుంటారు. కాగా ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో ఏప్రిల్‌ నెల నుంచి ఆగస్టు వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వాస్తవానికి గతంలో వేసవిలో సైతం గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పడిన అరకొర వర్షాల ఆధారంగా దుక్కి పనులు చేపట్టారు. తరువాత వర్షాల స్థితిగతులను గుర్తించి దశల వారీగా నాట్లు పూర్తి చేసుకున్నారు. అలాగే కొండ వాగులున్న ప్రాంతాల్లోని రైతులకు ఎటువంటి సాగునీటి సమస్యా లేనప్పటికీ, వర్షం ఆధారంగా నాట్లు వేసే మెట్ట ప్రాంత రైతులకు ఇబ్బందులు తలెత్తాయి.

ఆదుకున్న భారీ వర్షాలు

ఏజెన్సీలో ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జీకేవీధి మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు పడ్డాయి. కానీ మిగిలిన మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఖరీఫ్‌ పంటల సాగుకు జూన్‌ నుంచి ఆగస్టు లేదా సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షాలే ఆధారం. అయితే జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన వర్షాలు కురవనప్పటికీ, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలు ఖరీఫ్‌ పంటలకు జీవం పోశాయి. వాస్తవానికి ఆగస్టు వరకు ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ పంటలపై గిరిజన రైతుల ఆశలు సన్నగిల్లాయి. కానీ అందుకు భిన్నంగా సెప్టెంబరులో కురిసిన వర్షాలు ఆదుకున్నాయి.

జిల్లాలో 24 శాతం పెరిగిన ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గి ఖరీఫ్‌లో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు, వ్యవసాయాధికారులు ఆందోళన చెందారు. కానీ సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలతో అందుకు భిన్నమైన ఫలితాలు లభించాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 24 శాతం పంటల విస్తీర్ణం పెరిగింది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఖరీఫ్‌లో మొత్తం సాధారణ విస్తీర్ణం 61,669 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 76,456 హెక్టార్లలో పంటలు వేశారు. అందులో ఆహార పంటల సాధారణ విస్తీర్ణం 59,383 హెక్టార్లకు 70,340 హెక్టార్లలో, నూనె గింజల సాధారణ విస్తీర్ణం 2,068 హెక్టార్లకు 5,984 హెక్టార్లలో పంటలు వేశారు.

Updated Date - Oct 06 , 2026 | 12:11 AM