ఖరీఫ్ పనులు ఆరంభం
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:56 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు, మూడు రోజుల నుంచి రావికమతం, రోలుగుంట మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు దుక్కి దున్నడం, ఆకు మడులు సిద్ధం చేయడం, వరి విత్తనాలు చల్లడం వంటి పనులు చేపడుతున్నారు. రావికమతం మండలం కొత్తకోట, దొండపూడి, గర్నకం, కొమిర, మత్స్యపురం, చినపాచిల, రావికమతం, మట్టవానిపాలెం, గుడ్డిప తదితర గ్రామాల్లో పలువురు రైతులు ఆదివారం పొలాలకు వెళ్లి, మడులు సిద్ధం చేసుకొని వరి విత్తనాలు చల్లారు.
అల్పపీడనం వర్షాలతో వరి ఆకుమడులు సిద్ధం చేస్తున్న రైతులు
జోరుగా దుక్కి పనులు
రావికమతం/ రోలుగుంట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు, మూడు రోజుల నుంచి రావికమతం, రోలుగుంట మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు దుక్కి దున్నడం, ఆకు మడులు సిద్ధం చేయడం, వరి విత్తనాలు చల్లడం వంటి పనులు చేపడుతున్నారు. రావికమతం మండలం కొత్తకోట, దొండపూడి, గర్నకం, కొమిర, మత్స్యపురం, చినపాచిల, రావికమతం, మట్టవానిపాలెం, గుడ్డిప తదితర గ్రామాల్లో పలువురు రైతులు ఆదివారం పొలాలకు వెళ్లి, మడులు సిద్ధం చేసుకొని వరి విత్తనాలు చల్లారు. వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మండలంలో ఈ ఏడాది సుమారు ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యం. నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశించినప్పటికీ ఆ నెల చివరి వరకు చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. దీంతో రైతులు దుక్కి దున్నే పనులు మొదలుపెట్టలేదు. ఈ నెల రెండో తేదీ నుంచి వాతావరణం మారిపోయి రోజూ వర్షం కురుస్తున్నది. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో ఎక్కువ వర్షం పడింది. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. పొలాలను సిద్ధం చేసి ఆకుమడులు పోస్తున్నారు. బోర్లు, బావులు వున్న చోట ఇప్పటికే వరి నారు కోసం మడుల్లో విత్తనాలు చల్లారు.
రోలుగుంట మండలంలో కూడా ఖరీఫ్ దుక్కులు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యారు. వరి నారు కోసం ఆకుమడులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని సిద్ధంగా ఉంన్న భూముల్లో విత్తనాలు వేశారు. మండలంలో ఆగస్టు మధ్య నుంచి చివరి వరకు వరినాట్లు వేస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని 45 రోజుల ముందు నారుమడులు సిద్ధం చేసి వరి విత్తనాలు చల్లుతారు. మండలంలో ఖరీఫ్‌వరి సాగు విస్తీర్ణం మూడు వేల ఎకరాలుగా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. మండలంలో చెరువులు, కొమరవోలు ఆవ, కల్యాణపు లోవ రిజర్వాయర్ ఆధారంగా వరి సాగు చేస్తుంటారు.