ఆగస్టు వర్షాలపైనే ఖరీఫ్ ఆశలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:50 AM
ఆగస్టు వర్షాలపైనే ఖరీఫ్ ఆశలు
25ఎకెపిఅగ్రికల్చర్1ః మాట్లాడుతున్న ఇన్‌చార్జి ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి
- ఆర్‌ఏఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి
అనకాపల్లి అగ్రికల్చర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఖరీఫ్ పంటలకు అవకాశం ఉంటుందని ఆర్‌ఏఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఏడీఆర్ ఎ.అప్పలస్వామి తెలిపారు. శనివారం వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఖరీఫ్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందన్నారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 50 శాతం తక్కువగా నమోదైందని, జూలై సాధారణ వర్షపాతంలో 77 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో 17 మండలాల్లో 60 శాతం కన్నా తక్కువ, ఏడు మండలాల్లో 60 నుంచి 90శాతం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఖరీఫ్ మొత్తం పంటల విస్తీర్ణం 69 వేల ఎకరాలకు గాను కేవలం 3,756 ఎకరాల్లో పంటలు వేశారని వివరించారు. సీనియర్ వ్యవసాయాధికారి సీహెచ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు బాగా కురిస్తే ఎల్‌నినో ప్రభావం నుంచి ఖరీఫ్ తప్పించుకోవచ్చునన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగితే చేపట్టవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు. వివిధ మండలాల్లో వర్షపాతం, పంటల పరిస్థితిపై మండల వ్యవసాయాధికారులు వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉమామహేశ్వరరావు, సీనియర్ శాస్త్రవేత్తలు ఎం.విశాలాక్షి, ఎస్.రామలక్ష్మి, పి.శ్రీదేవి, ఎం.బి.జి.ఎస్.కుమారి, వి.చంద్రశేఖర్, తదితరులు ప్రసంగించారు.