Share News

ఖరీఫ్‌ ఆశలు ఆవిరి

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:33 AM

సెప్టెంబరులో కూడా వర్షాల జాడలేక పోవడంతో ఖరీఫ్‌ వరి సాగుపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కొన్నిచోట్ల మడుల్లో వరినారు ఎండిపోగా, మరికొన్నిచోట్ల వేసిన వరినాట్లు.. నీరు లేక ఎండిపోతున్నాయి. తీవ్రవర్షాభావం కారణంగా భూగర్భ జలాలు సైతం బాగా అడుగంటాయి. బోర్లు కింద నాట్లు వేసిన పొలాలకు సైతం పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలో ఈ ఏడాది 2,181 హెక్టారుల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఖరీఫ్‌ ఆశలు ఆవిరి
మత్స్యపురంలో ఎండిపోయిన వరినారు మడి

ఎండిపోయిన వరినారుమళ్లు

తీవ్రవర్షాభావంతో దిగజారిపోతున్న భూగర్భ జలాలు

బోర్లు కింద నాట్లు వేసిన పొలాలకు సరిగా అందని నీరు

నేల బీటలువారి.. ఎండిపోతున్న నాట్లు

రావికమతం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబరులో కూడా వర్షాల జాడలేక పోవడంతో ఖరీఫ్‌ వరి సాగుపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కొన్నిచోట్ల మడుల్లో వరినారు ఎండిపోగా, మరికొన్నిచోట్ల వేసిన వరినాట్లు.. నీరు లేక ఎండిపోతున్నాయి. తీవ్రవర్షాభావం కారణంగా భూగర్భ జలాలు సైతం బాగా అడుగంటాయి. బోర్లు కింద నాట్లు వేసిన పొలాలకు సైతం పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలో ఈ ఏడాది 2,181 హెక్టారుల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఖరీఫ్‌ ఆరంభం.. అంటే జూన్‌ నెల నుంచి వర్షాలు మొహం చాటేశాయి. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఒక్క నెలలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. సెప్టెంబరులో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వేసవిని తలపించేలా ఎండలు తీక్షణంగా కాస్తున్నాయి. మధ్యాహ్నంపూట వడగాడ్పులు వీస్తున్నాయి. చెరువుల్లో చుక్క నీరు లేదు. కల్యాణపులోవ జలాశయం అడుగంటింది. దీంతో మడుల్లో ఇప్పటికే వరినారు ఎండిపోయింది. పొలాలను దమ్ము చేయడం అటుంచి.. కనీసం దుక్కి కూడా దున్నలేదు. కొమిర, మత్స్యపురం, గర్నికం, మేడివాడ, దిడ్డి, బాదనపాడు, మట్టవానిపాలెం తదితర గ్రామాలల్లో బోర్లు వున్న రైతులు ఆగస్టు నెలాఖరులో సుమారు 150 ఎకరాల్లో దమ్ములు చేసి, వరినాట్లు వేశారు. సెప్టెంబరులో కూడా వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు మరింత దిగజారడంతో బోర్లు నుంచి సరిపడ నీరు రావడంలేదు. దీంతో నాట్లు వేసిన పొలాలకు నీరు చాలక నేల బీటలువారి, వరినాట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఎకరాకు సుమారు పది వేల రూపాయల వరకుపెట్టుబడి నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:33 AM