Share News

ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకం

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:05 AM

ఎల్‌నినో ప్రభావంతో గత పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. వర్షం లేక వరినారు మడులు ఎండిపోతుండగా.. మరికొన్నిచోట్ల వరి నారు మొలకలు రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకం
పాడి గ్రామ సమీపంలో తడి లేక ఎండుతున్న వరినారు మడి

పది రోజులుగా కురవని వర్షాలు

ఎండుతున్న నారుమడులు

రైతుల్లో ఆందోళన

కొయ్యూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో గత పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. వర్షం లేక వరినారు మడులు ఎండిపోతుండగా.. మరికొన్నిచోట్ల వరి నారు మొలకలు రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మండలంలో ఖరీఫ్‌లో వరి సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు మండల వ్యాప్తంగా రైతులు వరితో పాటు అపరాలు, చిరుధాన్యాల సాగుకు ఉపక్రమించారు. నారుమడుల్లో వరి విత్తనాలు చల్లారు. నారు మొలకలు వచ్చిన తర్వాత గత పది రోజులుగా వర్షం కురవలేదు. ఆకాశం మేఘావృతమైనా చినుకు పడడం లేదు. దీంతో భూమిలో ఉన్న తేమ పూర్తిగా హరించుకుపోయి మొలక వచ్చిన నారుమడులు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల మొలకెత్తడం లేదు. అపరాలు, చిరుధాన్యాలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కొండ వాగు ప్రవాహాలు, సాగునీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు వరినారు మడులకు తడులు పెడుతున్నారు. సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో నారుమడులు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతూ వరుణుడు కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:05 AM