Share News

మన్యంలో ఖరీఫ్‌ సందడి

ABN , Publish Date - Jul 06 , 2026 | 10:57 PM

మన్యంలో ప్రస్తుతం ఖరీఫ్‌ సందడి నెలకొంది. ఎక్కడ చూసినా వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమవుతున్న దృశ్యాలు, నీటితో నిండిన పంట పొలాలు, భూములను దున్నుతున్న రైతులు, నాట్లు వేస్తున్న మహిళలు కనిపిస్తున్నారు.

మన్యంలో ఖరీఫ్‌ సందడి
ముంచంగిపుట్టు మండలం లబ్బూరు ప్రాంతంలో వరి నాట్లు వేస్తున్న మహిళలు

వ్యవసాయ పనుల్లో గిరి రైతులు నిమగ్నం

పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో జోరుగా వరి నాట్లు

మిగిలిన మండలాల్లో దుక్కి పనులు, నారు తీత, దమ్ము పనులు

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 38,552 హెక్టార్లలో వరి సాగు

ఆగస్టు నెలాఖరుకు మొత్తం నాట్లు పూర్తయ్యే అవకాశం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో ప్రస్తుతం ఖరీఫ్‌ సందడి నెలకొంది. ఎక్కడ చూసినా వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమవుతున్న దృశ్యాలు, నీటితో నిండిన పంట పొలాలు, భూములను దున్నుతున్న రైతులు, నాట్లు వేస్తున్న మహిళలు కనిపిస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో సైతం వర్షాలు కురవడంతో దుక్కి పనులను చేపట్టారు. అలాగే జూన్‌ నెలాఖరుకు మొత్తం దుక్కి పనులను పూర్తి చేసి, దశల వారీగా నాట్లు వేసి, ఆగస్టు ముగిసే నాటికి వరి నాట్లు పూర్తి చేసేలా వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 65 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతుండగా, దానిలో వరి 38,552 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో వరి సాగవుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదనే విమర్శలున్నాయి. అందువల్లే ఏజెన్సీలోని గిరిజన రైతులు తమ ఆహార అవసరాలకు మాత్రమే వరిని సాగు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వరి పంటను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడం లేదు. అయితే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ పథకంలో 57 వేల 225 మంది రైతులకు మూడు విడతలుగా ఏడాదికి రూ.20 వేలు చొప్పున అందుతుండగా, రాయితీ విత్తనాలు మాత్రం అరకొరగానే పంపిణీ జరుగుతున్నదని రైతులు అంటున్నారు. తమకు సర్కారు నుంచి మరింత సాయం అందాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఖరీఫ్‌ జోరు

ఏజెన్సీలో ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకే వీధి ప్రాంతాల్లో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 50 శాతం పైబడి వరి నాట్లు పడగా, మిగిలిన మండలాల్లో 25 నాట్లు వేయని పరిస్థితి ఉంది. ముంచంగిపుట్టు, పెదబయలు, జీకే వీధి, జి.మాడుగుల మండలాల్లో వర్షాలు అధికంగా ఉండడంతో జూన్‌ రెండో వారం నుంచే వరి నాట్లు ప్రారంభించారు. మిగిలిన మండలాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అలాగే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వర్షాలు అంతగా అనుకూలించలేదు. దీంతో దుక్కి పనులు సైతం కాస్త ఆలస్యమయ్యాయి. అందువలన ఆగస్టు నెలాఖరుకు గాని నాట్లు పూర్తయ్యే అవకాశం లేదని గిరి రైతులు అంటున్నారు.

జిల్లాలో హుకుంపేటలోనే వరి విస్తీర్ణం అధికం

జిల్లాలోని మొత్తం పదకొండు మండలాల్లో 38 వేల 552 వందల హెక్టార్లలో వరి సాగు అవుతోంది. అలాగే హుకుంపేట మండలంలో అత్యధికంగా 6,138 హెక్టార్లలో సాగవ్వగా, కొయ్యూరు మండలంలో అత్యల్పంగా 1,882 హెక్టార్లలో మాత్రమే పండిస్తున్నారు. అనంతగిరిలో 2,184 హెక్టార్లు, అరకులోయలో 3,859, ముంచంగిపుట్టులో 3,271, పెదబయలులో 4,249, డుంబ్రిగుడలో 3,411, పాడేరులో 3,650, జి.మాడుగులలో 3,532, చింతపల్లిలో 3,419, జీకేవీధిలో 2,957 హెక్టార్లలో వరి సాగును గిరిజన రైతులు చేపడుతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 10:57 PM