Share News

ఖాకీ కలెక్షన్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:44 AM

ఆయనొక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. దూకుడు ఎక్కువ కావడంతో ఎక్కడపనిచేసినా వివాదాలు చుట్టుముడుతుంటాయి.

ఖాకీ కలెక్షన్‌

పారిశ్రామిక ప్రాంతంలో ఓ సీఐపై ఆరోపణల వెల్లువ

నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలు

తనకు బంధువులంటూ ప్రచారం

వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయిస్తానంటూ సీనియర్‌ ప్రజా ప్రతినిధికి భరోసా

ఆయనతో సీపీకి సిఫారసు లేక..నియోజకవర్గంలో పోస్టింగ్‌

బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే వసూళ్ల దందా

పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం జరిగితే పండుగే

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు

అయినా చర్యలు శూన్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆయనొక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. దూకుడు ఎక్కువ కావడంతో ఎక్కడపనిచేసినా వివాదాలు చుట్టుముడుతుంటాయి. సదరు సీఐ స్థానికుడే కాకుండా నగరంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటారనే పేరుంది. తన సామాజికవర్గానికి చెందిన వారితో వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయిస్తానంటూ ఒక సీనియర్‌ ప్రజా ప్రతినిధికి చెప్పి ఆయన నియోజకవర్గంలో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. బాధ్యతలు స్వీకరించింది మొదలు వసూళ్లపైనే దృష్టిపెట్టారని, బెదిరించి మరీ డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యంత డిమాండ్‌ ఉన్న స్టేషన్లలో పారిశ్రామిక ప్రాంతంలో గల ఆ స్టేషన్‌ ఒకటి. అక్కడ పోస్టింగ్‌ కోసం సీఐలు తీవ్రంగా పోటీపడుతుంటారు. వైసీపీ హయాంలో నగరంలో కీలక పోలీస్‌ స్టేషన్లలో పనిచేసిన సదరు సీఐ అప్పట్లో నగరాన్ని గుప్పెట్లో పెట్టుకుని శాసించిన నేతల చుట్టూ ఆ పార్టీ కార్యకర్త మాదిరిగా తిరిగారు. వైసీపీ నేతల ఆదేశాలే పరమావధిగా పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత రేంజ్‌కు బదిలీ కాగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి నగరానికి వచ్చేశారు. అంతేకాకుండా భారీగా అదనపు ఆదాయం సమకూరే ఒక పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్‌పై కన్నేశారు. దీనికోసం తన సామాజిక వర్గానికి చెందిన నగరంలోని ఇద్దరు ప్రజా ప్రతినిధులు వద్దకు వెళ్లి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే నగరానికి చెందిన ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో పలుకుబడి ఎక్కువ కలిగిన మరొక ప్రజాప్రతినిధి అప్పటికే ఆ పోస్టు కోసం వేరొకరి పేరును సిఫారసు చేశారు. దాంతో ఆ స్టేషన్‌కు దాదాపు సమానంగా అదనపు ఆదాయం వచ్చే పారిశ్రామిక ప్రాంతంలోని మరొక స్టేషన్‌పై గురిపెట్టారు. ఆ పోలీస్‌స్టేషన్‌ పరిధి కలిగిన ఎమ్మెల్యేకు తన సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకున్నారు. తర్వాత సదరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తన సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలు చాలామంది మీ నియోజకవర్గం పరిధిలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారంతా మీకు ఓట్లు వేసేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో సదరు ఎమ్మెల్యే ఆ పోలీస్‌ స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇప్పించాలంటూ సీపీని కోరుతూ లేఖ ఇవ్వడం, ఆ స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇవ్వడం ఆగమేఘాల మీద జరిగిపోయాయి.

మొదటి రోజు నుంచే వసూళ్లకు శ్రీకారం

పారిశ్రామిక ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించడమే తరువాయి అన్నట్టు వసూళ్లకు శ్రీకారం చుట్టారని అక్కడ పనిచేస్తున్న సిబ్బందే ఆరోపిస్తున్నారు. మూడు నెలల కిందట ఒక కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్‌ తగలడంతో కార్మికుడు మృతిచెందాడు. సదరు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లనే కార్మికుడు చనిపోయాడని, తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తే మృతుడికి బీమా పరిహారం రాకపోవడంతోపాటు కంపెనీ యజమాని జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సీఐ బెదిరించినట్టు సిబ్బంది చెబుతున్నారు. రూ.15 లక్షలు డిమాండ్‌ చేయడంతో చేసేది లేక ఆ మొత్తం ఇచ్చిన బాధితుడు, దీనిపై ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయితే ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు మౌనం వహించినట్టు పేర్కొంటున్నారు.

ఐదు నెలల కిందట ఒక పరిశ్రమలో పిడుగు పడడంతో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో నాలుగైదు రోజులపాటు అగ్నికీలలు అదుపులోకి రాలేదు. తీవ్రమైన ప్రమాదం కావడంతో ఆ కేసును ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి. కానీ సదరు సీఐ మాత్రం కేసు దర్యాప్తును తన వద్దనే ఉంచుకుని, పిడుగులు పడినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా పరిశ్రమ నిర్వాహకులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, అందువల్ల కేసు రాస్తానని నిర్వాహకులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. వారి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు కేసు నమోదుచేస్తే బీమా పరిహారం చెల్లింపునకు సదరు బీమా కంపెనీ తిరస్కరిస్తుందని, అదే జరిగితే భారీగా నష్టపోవాల్సి ఉంటుందనే భయంతో సానుకూలంగా వ్యవహరించాలని నిర్వాహకులు సీఐని కోరారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘లావాదేవీలు’ పూర్తయిన తర్వాత ఆ కేసు ఫైల్‌ను దర్యాప్తు కోసం ఏసీపీకి అందజేసినట్టు పోలీసు శాఖలో ప్రచారం జరిగింది.

ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనేక పరిశ్రమలు ఉండడంతో అందులో ఉద్యోగాలు, అంప్రెటిస్‌షిప్‌ల కోసం విద్యార్థులు, నిరుద్యోగులు వెళుతుంటారు. వారికి స్పెషల్‌ బ్రాంచి నుంచి ఎంక్వైరీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సదరు సీఐ మాత్రం ఆ బాధ్యతను తనకు అప్పగించేలా ఉన్నతాధికారుల వద్ద చక్రం తిప్పి సఫలమయ్యారని స్టేషన్‌ సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారని, గత ఏడాది కాలంలో దాదాపు 20 వేల వెరిఫికేషన్‌లు చేసినట్టు చెబుతున్నారు. సదరు సీఐ తమను కూడా దుర్భాషలాడుతుంటారని స్టేషన్‌ సిబ్బందిని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నాసరే స్పెషల్‌బ్రాంచి అధికారులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 01:44 AM