Share News

త్వరలో కేజీహెచ్‌ అభివృద్ధి మండలి నియామకం

ABN , Publish Date - May 24 , 2026 | 12:41 AM

కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి అభివృద్ధి మండలి (హెచ్‌డీఎస్‌) నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

త్వరలో కేజీహెచ్‌ అభివృద్ధి మండలి నియామకం

కలెక్టర్‌ వద్దకు ఫైల్‌

విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):

కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి అభివృద్ధి మండలి (హెచ్‌డీఎస్‌) నియామక ప్రక్రియ ప్రారంభమైంది. పదిహేను మంది సభ్యులతో కూడిన జాబితాను ఆస్పత్రి అధికారులు జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌కు పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన హెచ్‌డీఎస్‌ పదవీ కాలం ముగిసింది. ఏటా అభివృద్ధి మండలిని రెన్యువల్‌ చేస్తూ ఉండాలి. అయితే, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొత్త కమిటీని ఏర్పాటుచేయలేదు. దీంతో ఆస్పత్రి అధికారులు నూతన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త సభ్యులతో కూడిన జాబితాను కలెక్టర్‌ వద్దకు పంపించారు. హెచ్‌డీఎస్‌ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. కో-చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఎంపీ, డీఎంఈ, జీవీఎంసీ కమిషనర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈతోపాటు నామినేటెడ్‌ సభ్యులు మరో ఐదుగురు ఉంటారు. స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులకు అవకాశం కల్పిస్తారు.


ఆరు వేల మందికి కన్వేయన్స్‌ డీడ్లు

22-ఏ నుంచి త్వరలో గ్రామ కంఠాలు తొలగింపు

రేషన్‌ కార్డుల్లో పేరు కలిగిన వారంతా ఈకేవైసీ పూర్తిచేయాలి

జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి

విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో గతంలో పట్టాలు పొందిన ఆరు వేల మంది ఆక్రమణదారులకు కన్వేయన్స్‌ డీడ్లు అందజేసి రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ పెదగంట్యాడ, గాజువాక, మహారాణిపేట, విశాఖ రూరల్‌, ములగాడ మండలాల్లో అర్హులైన వ్యక్తులకు కన్వేయన్స్‌ డీడ్లు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. మహారాణిపేట మండలం పెదజాలారిపేటలో 1,283 మందికి కన్వేయన్స్‌ డీడ్లు ఇచ్చేందుకు జాబితా రూపొందించామన్నారు. అలాగే గ్రామ కంఠం భూములకు 22-ఎ నుంచి మినహాయింపులు ఇస్తామన్నారు. గ్రామ కంఠాలను 22-ఎ నుంచి తొలగిస్తే గ్రామంలో నివాసితులందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనికి సంబంధించి త్వరలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రానున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు కఠినంగా వ్యవహరిస్తామని ఆమె స్పష్టంచేశారు. జిల్లాలోని 5.24 లక్షల బియ్యం కార్డుల్లో 15 లక్షల మంది సభ్యులు ఉండగా, ఇంకా 55,630 మంది ఈకేవైసీ చేయించుకోలేదన్నారు. నెలాఖరులోగా సమీపంలోని సచివాలయం లేదా రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి ఈకేవైసీ పూర్తిచేయాలని సూచించారు. వంట గ్యాస్‌ సరఫరా సజావుగా సాగుతుందని, ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం రోజుకు రమారమి అరవై వేల మంది గ్యాస్‌ బుక్‌ చేస్తున్నారని వివరించారు. వారం రోజుల వ్యవధిలో సిలిండర్లు సరఫరా చేస్తున్నామని జేసీ తెలిపారు.

Updated Date - May 24 , 2026 | 12:41 AM