Share News

అస్వస్థతకు గురై కేజీబీవీ విద్యార్థిని మృతి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:04 PM

మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో పదవ తరగతి విద్యార్థిని సెలవుపై ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. దీ

అస్వస్థతకు గురై కేజీబీవీ విద్యార్థిని మృతి
మృతురాలు లక్ష్మీదేవి(ఫైల్‌ఫొటో)

హోం సిక్‌ అని చెప్పి సెలవుపై ఇంటికి తీసుకువెళ్లిన తండ్రి

అజీర్తి చేయడంతో నాటు మందు రాసిన కుటుంబ సభ్యులు

అనారోగ్యంతో కన్నుమూత

డుంబ్రిగుడ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో పదవ తరగతి విద్యార్థిని సెలవుపై ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. దీనికి సంబంధించి ఆ బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డుంబ్రిగుడ కేజీబీవీలో పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన బడ్నాయిని లక్ష్మీదేవి(15) పదవ తరగతి చదువుతోంది. ఈ విద్యాసంవత్సరం పాఠశాల పునఃప్రారంభం నుంచి పాఠశాలలోనే ఉంది. అయితే తనను ఇంటికి తీసుకువెళ్లాలని ఆ బాలిక తండ్రికి కబురు చేసింది. దీంతో బాలిక తండ్రి రామస్వామి ఈ నెల 4న పాఠశాలకు వచ్చి హోం సిక్‌ అని చెప్పి సెలవుపై కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు సాయంత్రం ఆ బాలికకు అజీర్తి చేయడంతో కుటుంబ సభ్యులు పోదు మందు రాశారు. ఆదివారం ఉదయం కూడా ఇదే పద్ధతిలో పోదు మందు రాశారు. మధ్యాహ్నం హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో డుంబ్రిగుడ పీహెచ్‌సీకి తరలించారు. ఇక్కడి వైద్య సిబ్బంది పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆదివారం సాయంత్రం అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు నిర్ధారించారు. బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తరలించారు. ఈ విషయంపై కేజీబీవీ సిబ్బందిని సంప్రతించగా, ఈ నెల 4న బాలిక తండ్రి పాఠశాలకు వచ్చి హోం సిక్‌ అని చెప్పి సెలవుపై ఇంటికి తీసుకువెళ్లారన్నారు. ఆ బాలిక అస్వస్థతకు గురైనట్టు ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబీకులు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారని ఆ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పద్మ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ బాలిక స్వగ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించామన్నారు. విద్యార్థిని మృతిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నామని ఆమె తెలిపారు.

Updated Date - Jul 06 , 2026 | 11:04 PM