Share News

కేజీబీవీ విద్యార్థిని మృతి

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:10 AM

అచ్యుతాపురం కేజీబీవీలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిని విషపురుగు కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం మృతి చెందింది.

కేజీబీవీ విద్యార్థిని మృతి
మృతురాలు మైలపల్లి నవ్య(ఫైల్‌ ఫొటో)

కందిరీగ కుట్టిందని తల్లిదండ్రులకు చెప్పిన పాఠశాల సిబ్బంది

పాము కరిచి చనిపోయిందంటున్న కుటుంబ సభ్యులు

పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన గ్రామస్థులు

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం కేజీబీవీలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిని విషపురుగు కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పూడిమడక శివారు కడపాలేనికి చెందిన మైలపల్లి నవ్య(13) అచ్యుతాపురం కేజీబీవీలో ఏడవ తరగతి చదువుతోంది. శనివారం ఉదయం సుమారు 5.15 గంటలకు నవ్యను కందిరీగ కుట్టిందని, ఇబ్బంది పడుతోందని ఆ బాలిక తండ్రి రాజుకు పాఠశాల సిబ్బంది ఫోన్‌ చేసి చెప్పారు. తాము పూడిమడక నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని, ఆస్పత్రికి తీసుకు వెళ్లమని సిబ్బందిని బాలిక తండ్రి కోరారు. అయితే తమ వద్ద వాహనాలు లేవని, మీరే వచ్చి తీసుకువెళ్లండని సిబ్బంది చెప్పారు. దీంతో తాను బైక్‌పై అచ్యుతాపురం వెళ్లి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చానని బాలిక తండ్రి రాజు తెలిపారు. అచ్యుతాపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో రెండు గంటలు చికిత్స చేసి రూ.22 వేలు వసూలు చేసి పరిస్థితి విషమంగా ఉందని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారని, వెంటనే అనకాపల్లి తీసుకువెళ్లామని రాజు తెలిపారు. అక్కడ చికిత్స చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయిందని రాజు విలపిస్తూ తెలిపారు. తమ కుమార్తెకు పాము కరిచిందని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కుమార్తె చనిపోయిందని నవ్య తల్లిదండ్రులు రాజు, ఎల్లయ్యమ్మ విలపించారు. సుమారు 280 మంది విద్యార్థినులున్న ఈ పాఠశాల ఆవరణలో పాములు తిరుగుతున్నాయని, గతంలో కూడా తాము సిబ్బందికి తెలిపినా చర్యలు తీసుకోలేదని వీరు ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అచ్యుతాపురం పాఠశాల వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌, డీఈవో వచ్చి విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పరిహారం ప్రకటించాలని ఆందోళన చేశారు. పరవాడ డీఎస్పీ మోహనరావు, సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు.

Updated Date - Apr 12 , 2026 | 12:10 AM