సమస్యలతో కేజీబీవీ సతమతం
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:42 PM
మండలంలోని యండపల్లివలస కస్తూర్బా విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. విద్యాలయంలో అసంపూర్తి భవనాలు, రన్నింగ్ వాటర్ లేకపోవడం, మూలకు చేరిన వాటర్ ప్లాంట్ వంటి సమస్యలతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. రెగ్యులర్ స్పెషల్ ఆఫీసర్ లేక ఇన్‌చార్జిలతో కాలవ వెల్లదీస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు విమర్శిసున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అరకొరగా నిర్మాణాలు
రన్నింగ్ వాటర్ సౌకర్యం పూజ్యం
మూలకు చేరిన వాటర్ ప్లాంట్
ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు
ఇన్‌చార్జి ఎస్‌వోలతో నిర్వహణ
పట్టించుకోని అధికారులు
అరకులోయ, జూలై 10 (ఆంధ్రజ్యోతి):మండలంలోని యండపల్లివలస కస్తూర్బా విద్యాలయంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు 285 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకంలో మంజూరైన భవనాలు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో బాలికలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. మరో అదనపు వసతి భవనం నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఫ్లోరింగ్‌కు సంబంధించి టైల్స్, సున్నాలు వేస్తున్నారు. ప్రస్తుత వసతిగృహం, తరగతులకు ఉపయోగపడే భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. విద్యాలయంలో విద్యార్థినులకు అవసరమైన కనీస సౌకర్యాలు లేవు. బాత్‌రూమ్‌లకు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు. మోటారు నుంచి నేరుగా నీరు వచ్చే పైప్ నుంచి బక్కెట్లతో నీరు పట్టుకొని టాయ్‌లెట్స్ వద్దకు బాలికలు మోసుకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. భోజనాలు చేసిన తర్వాత చేతులు కడుకునేందుకు కూడా రన్నింగ్ వాటర్ ఉన్న కొళాయి పాయింట్ పనిచేయడం లేదు. సుమారు మూడు వందల మంది బాలికలు రన్నింగ్ వాటర్ లేక నిత్యం నరకయాతన పడుతున్నా సంబంధిత అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. తాగడానికి వాటర్ ప్లాంట్ ఉన్నా అది మూలకు చేరింది. వాస్తవానికి సమగ్ర శిక్షా అధికారులే భవన నిర్మాణ పనులు, వసతిగృహం నిర్వహణ, మెనూ అన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మెనూకు సంబంధించిన సరకులను జీసీసీ ద్వారా కాకుండా విశాఖపట్నం నుంచే ప్రైవేటుగా సమగ్ర శిక్షా అధికారులే తీసుకువస్తున్నారు. కానీ సకాలంలో మెనూకు సంబంధించి సరకులు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కేజీబీవీలో మెనూ పక్కాగా అమలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన ప్రత్యేక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారే తప్ప రెగ్యులర్ ఎస్‌వోను నియమించడం లేదు. జిల్లా కలెక్టర్, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ విద్యాలయంలో వసతులు, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించి లోపాలను సరి చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.