శరవేగంగా కేజీబీవీ భవన నిర్మాణం
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:24 PM
మండల కేంద్రంలో రూ.కోటి వ్యయంతో కస్తూర్బా గాంధీ విద్యాలయం టైప్-4 భవనం సిద్ధమవుతోంది.
వసతి గృహ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
కొయ్యూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో రూ.కోటి వ్యయంతో కస్తూర్బా గాంధీ విద్యాలయం టైప్-4 భవనం సిద్ధమవుతోంది. ఇది ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇందులో వసతి గృహం నిర్వహణకు అవసరమైన మేట్రిన్, కుక్, వాచ్‌మన్ పోస్టుల భర్తీకి సర్వశిక్ష అభియాన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మండలంలో బాలికల విద్యాభివృద్ధిలో భాగంగా కేజీబీవీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు గాను ప్రత్యేకంగా రూ.కోటి వ్యయంతో ఎస్‌ఎస్‌ఏ నిధులతో వసతి గృహ నిర్వహణకు వీలుగా కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో భవనం నిర్మిస్తున్నారు. ఇందులో దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10 తరగతుల విద్యార్థినులతో పాటు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే బాలికలకు తరగతుల వారీగా తరగతికి 25 మంది వసతి గృహంలో ఉండి చదువుకునేలా ప్రవేశం కల్పించనున్నారు. మండల కేంద్రంలో ఇప్పటికీ ఈ తరహాలో వసతి గృహం లేకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థినుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కస్తూర్బా టైప్-4 భవనం నిర్మాణంతో ఈ ఇబ్బందులు తీరనున్నాయి. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మరో నెల రోజుల వ్యవధిలో ఈ భవనం అందుబాటులోకి రానుంది. ఈ వసతి గృహ నిర్వహణకు వీలుగా అవసరమైన మేట్రిన్, కుక్, తదితర సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలో నియామకాలు పూర్తి చేస్తామని సర్వశిక్ష అభియాన్ ఏపీసీ స్వామినాయుడు తెలిపారు.