పోర్టులో కీలక ప్రాజెక్టులకు శ్రీకారం
ABN , Publish Date - May 12 , 2026 | 01:21 AM
విశాఖపట్నం పోర్టులో పలు కీలక ప్రాజెక్టులకు పోర్టు చైర్మన్ అంగముత్తు సోమవారం శంకుస్థాపన చేశారు.
కాన్వెంట్ జంక్షన్ నుంచి హెచ్-7 జంక్షన్ వరకు బీటీ రహదారి నిర్మాణం, ఓర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్‌లో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పూర్తయిన అభివృద్ధి పనులు ప్రారంభం
విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టులో పలు కీలక ప్రాజెక్టులకు పోర్టు చైర్మన్ అంగముత్తు సోమవారం శంకుస్థాపన చేశారు. అన్ని గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ పరికరాలు, కార్గో గేట్ల వద్ద రేడియోలాజికల్ డిటెక్షన్ పరికరాలు, కాన్వెంట్ జంక్షన్ నుంచి హెచ్-7 జంక్షన్ వరకు బీటీ రహదారి నిర్మాణం, ఓర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్‌లో రహదారుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో పోర్టులో 38 కి.మీ. రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ, పరిపాలనా భవనంలో డిస్‌ప్లే కారిడార్, ఎస్‌టీపీ వద్ద 170 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్‌వీ రైల్వే ట్రాక్ అప్‌గ్రడేషన్, కస్టమ్స్ ప్రహరీ వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోర్టు సెక్రటరీ శంకర్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉక్కు పవర్ ప్లాంటులో కార్బన్ మోనాక్సైడ్ లీక్
నలుగురు కాంట్రాక్టు కార్మికులకు అస్వస్థత
గాజువాకలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఉక్కుటౌన్‌షిప్ (విశాఖపట్నం), మే 11 (ఆంధ్రజ్యోతి): ఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్లాంటు (టీపీపీ) విభాగంలో సోమవారం కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంతో నలుగురు కాంట్రాక్టు కార్మికులు అస్వస్థతతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. టీపీపీ విభాగంలో ఓ కాంట్రాక్టు సంస్థ వద్ద జీవీఎంసీ 77వ వార్డు నమ్మిదొడ్డి ప్రాంతానికి చెందిన నమ్మి శ్రీనివాసరావు (37), దాసరి తాతారావు (55), దాసరి అప్పన్నరెడ్డి (43), దేవాడకు చెందిన ఎండీ అజీజ్ (51) పనిచేస్తున్నారు. వీరంతా సోమవారం ఎనిమిది మీటర్ల ఎత్తులో గల ప్లాట్‌ఫా మ్‌పై నిల్చుని కప్లింగ్ మార్చే పనులు చేస్తున్నారు. ఆ సమయంలో పైపులో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ లీకైంది. దీంతో నలుగురూ స్పృహ తప్పి కిందపడిపోయారు. ఈ విషయాన్ని సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు గుర్తించి వెంటనే గ్యాస్ వాల్వ్‌ను కట్టేశారు. అస్వస్థతతకు గురైన కార్మికులను వెంటనే ఉక్కు జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కింద పడిపోయే సమయంలో నమ్మి శ్రీనివాసరావు కాలు కప్లింగ్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు లేబర్ యూనియన్ సీఐటీయూ నాయకులు నమ్మి రమణ పరామర్శించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ, నిజాముద్దీన్, ఫరీదాబాద్‌లకు ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ-ఢిల్లీ, విశాఖ-నిజాముద్దీన్, విశాఖ-ఫరీదాబాద్ మధ్య ఒక ట్రిప్పు (రానుపోను) ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడుతున్నామని సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు.
విశాఖ-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (08511) ఈనెల 22న ఉదయం 4.15 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.00 గంటలకు ఢిల్లీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ-విశాఖ ఎక్స్‌ప్రెస్ (08512) ఈనెల 25న ఉదయం వేకువజామున 2.00 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 5.00 గంటలకు విశాఖ చేరుతుంది.
విశాఖ-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (08517) ఈనెల 22న ఉదయం 3.30 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.30 గంటలకు న్యూఢిల్లీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో న్యూఢిల్లీ-విశాఖ ఎక్స్‌ప్రెస్ (08518) ఈనెల 25న వేకువజామున 1.45 గంటలకు న్యూ ఢిల్లీలో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 4.00 గంటలకు విశాఖ చేరుతుంది.
విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (08513) ఈనెల 21న సాయంత్రం 5.40 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.40 గంటలకు నిజాముద్దీన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (08514) ఈనెల 24న రాత్రి 11.55 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.40 గంటలకు విశాఖ చేరుతుంది.
విశాఖ-ఫరీదాబాద్ ఎక్స్‌ప్రెస్ (08515) ఈనెల 21న ఉదయం 4.15 గంటలకు విశాఖలో బయలుదేరి 23న ఉదయం 8.00 గంటలకు ఫరిదాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణయంలో ఫరీదాబాద్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (08516) ఈనెల 24న అర్ధరాత్రి 12.10 (తెల్లవారితే 25వ తేదీ) ఫరీదాబాద్‌లో బయలుదేరి 26వ తేదీ అర్ధరాత్రి 12.45 గంటలకు (తెల్లవారితే 27వ తేదీ) విశాఖ చేరుతుంది.