ఆ సీఐకి కీలక పోస్టింగ్!
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:51 AM
గంజాయి ఉందనే సమాచారం వచ్చిందంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన కోరాడ రామారావు అనే పోలీస్ అధికారికి నగరంలో కీలకమైన కంచరపాలెం స్టేషన్ సీఐగా పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
గంజాయి ఉందని అప్పట్లో టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసిన కోరాడ రామారావు
పార్టీ నాయకులపై ఇష్టానుసారం కేసుల బనాయింపు
అటువంటి అధికారి ఇప్పుడు కంచరపాలెం సీఐగా నియామకం
నాయకుల మండిపాటు
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
గంజాయి ఉందనే సమాచారం వచ్చిందంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన కోరాడ రామారావు అనే పోలీస్ అధికారికి నగరంలో కీలకమైన కంచరపాలెం స్టేషన్ సీఐగా పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో కోరాడ రామారావు త్రీటౌన్ సీఐగా పనిచేశారు. సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వెనుక ఉన్న టీడీపీ కార్యాలయం త్రీటౌన్ పరిధిలో ఉంటుంది. అప్పట్లో కొందరు వైసీపీ నాయకుల దన్నుతో కోరాడ రామారావు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేసినా, చివరకు లోపల అప్పటి సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేసినా అరెస్టు చేసేవారు. గంజాయి ఉందని వైసీపీ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో టీడీపీ కార్యాలయం లోపలకు వచ్చి అన్ని గదులు తనిఖీ చేశారు. అప్పట్లో చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా ఆందోళన చేసిన నాయకులపై కేసులు పెట్టారు. పార్టీ కార్యాలయం నుంచి కిందనున్న సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వరకు ఊరేగింపు నిర్వహించిన అప్పటి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు పలువురిని అరెస్టు చేసే క్రమంలో ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ నాయకులంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్‌పైనే ఏడు కేసులు ఉన్నాయి. పార్టీ కార్యాలయం వద్ద, పరిసరాల్లో ఎటువంటి కార్యక్రమం చేపట్టడానికి అనుమతించకుండా పలు రకాలుగా వేధించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తుండేవారు. అటువంటి అధికారికి ఇప్పుడు నగరంలో పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై నాయకులు మండిపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేల దృష్టికి ఈ పోస్టింగ్ వ్యవహారాన్ని తీసుకువెళతామని పార్టీ నాయకులు వెల్లడించారు.
ఐటీ హిల్స్‌లో రహేజా టవర్స్
హిల్ నంబర్ 2పై ఐటీ, రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి ఏర్పాట్లు
రూ.2,172.26 కోట్లతో నిర్మాణం
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘రహేజా’ విశాఖపట్నంలో ఐటీ, రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. వీరికి మధురవాడ (రుషికొండ ఐటీ హిల్స్ నంబరు 3) సర్వే నంబరు 410లో రాష్ట్ర ప్రభుత్వం 27.01 ఎకరాల భూమిని గత అక్టోబరులో కేటాయించింది. అందులో ఐటీతో పాటు నివాసానికి ఉపయోగపడే టవర్‌లను రూ.2,172.26 కోట్లతో నిర్మిస్తామని రహేజా ప్రతిపాదించింది. కేటాయించిన భూమిలోని 14.85 ఎకరాల్లో 3,84,265 చ.మీ. విస్తీర్ణంలో ఐటీ ఆఫీస్ టవర్లు, మిగిలిన 12.16 ఎకరాల భూమిలో 2,05,411 చ.మీ. విస్తీర్ణంలో ఐదు రెసిడెన్షియల్ టవర్లు నిర్మిస్తామని ప్రభుత్వానికి ప్లాన్ సమర్పించింది. ఐటీ ఆఫీస్ టవర్ ఒక్కో దాంట్లో ఐదు పోడియంలు+గ్రౌండ్ ఫ్లోర్+11 అంతస్థులు నిర్మిస్తామని పేర్కొంది. రెసిడెన్షియల్ టవర్లు ఒక్కో దాంట్లో 3 పోడియంలు+గ్రౌండ్ ఫ్లోర్+12 అంతస్థులు ఉంటాయని పేర్కొంది. మొత్తం చూసుకుంటే 900 రెసిడెన్షియల్ యూనిట్లు వస్తాయని వివరించింది. అందులో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 150, త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 405, లార్జ్ త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 255, ఫోర్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 90 ఉంటాయని తెలిపింది. ఈ భవన నిర్మాణాల ప్లాన్‌కు ఆమోదం రాగానే పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
నేడు పల్స్ పోలియో
ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలి
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 1,89,712 మంది ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 1,062 బూత్‌లు, 62 ట్రాన్సిట్ బూత్‌లు, 94 మొబైల్ బూత్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. బూత్‌లకు రాని చిన్నారులను జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి చుక్కలు వేయనున్నామన్నారు. ఇందుకోసం నియమించిన ప్రత్యేక బృందాలు, వ్యాక్సినేటర్లు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ట్రాన్సిట్ బూత్‌ల ద్వారా ప్రయాణంలో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలను సమీపంలోని కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలన్నారు.