కౌశలం... స్పందన అనూహ్యం
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:16 AM
రాష్ట్రంలో వేర్వేరు రంగాల్లో పది లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచి పనిచేయడం) ద్వారా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి పొందేందుకు ప్రభుత్వ సహకారం
కనీస విద్యార్హత డిగ్రీ
జిల్లాలో 1,73,973 మంది దరఖాస్తు
ఇప్పటివరకూ 1,21,400 మందికి రాత పరీక్ష
గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్వహణ
యూనిఫైడ్ సర్వేలో నమోదైన యువతకు త్వరలో రాత పరీక్షలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో వేర్వేరు రంగాల్లో పది లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచి పనిచేయడం) ద్వారా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ‘కౌశలం’ అనే పథకం ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. గత ఏడాది నవంబరు నుంచి దరఖాస్తుదారులకు సంబంధిత స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల్లో రాత పరీక్షలు జరుగుతున్నాయి.
జిల్లాలో 607 స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఇప్పటివరకూ 1,73,973 మంది దరఖాస్తు చేసుకున్నారు. జీవీఎంసీ పరిధిలో 1,57,924, ఆనందపురం మండలంలో 5,173, భీమిలి మండలంలో 4,124, పద్మనాభంలో 3,189, పెందుర్తి మండలంలో 3,563 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. శుక్రవారం వరకు 1,21,400 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ప్రతిరోజు జిల్లాలో ఒక వార్డు/గ్రామ సచివాలయంలో కనీసం ఇద్దరు లేదా ఒకరు రాత పరీక్షకు హాజరవుతున్నారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో పెట్టుకున్న దరఖాస్తు మేరకు సంబంధిత కంపెనీ నుంచి అభ్యర్థులకు రాత పరీక్షకు హాజరుకావాలని సమాచారం అందుతుంది. స్లాట్‌లో పేర్కొన్న విధంగా తమ పరిధిలో ఉన్న స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు సచివాలయంలో రాత పరీక్షకు అభ్యర్థులు హాజరవుతున్నారు. రోజువారీగా ఆయా కార్యాలయాలకు ఎంతమందికి హాజరవుతున్నారనే విషయం సంబంధిత సిబ్బందికి సమాచారం అందుతుంది. ఆ మేరకు వెబ్ కెమెరా సదుపాయం ఉన్న ల్యాప్‌టాప్/డెస్క్ టాప్ కేటాయిస్తారు. గంటపాటు జరిగే రాత పరీక్షను కార్యాలయ ఉద్యోగి వరకు పర్యవేక్షిస్తారు. శుక్రవారం స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి ఉషారాణి ఆనందపురంలో వర్క్ ఫ్రమ్ హోం పరీక్షను పర్యవేక్షించారు. ఇప్పటివరకూ 1,21,400 మంది రాత పరీక్షకు హాజరుకాగా వారిలో ఎంతమందికి ఇంటర్వ్యూలకు అవకాశం వచ్చింది?, ఎంతమందికి ఉపాధి లభించిందనే సమాచారం సేకరణలో స్వర్ణగ్రామం/స్వర్ణ వార్డు జిల్లా అధికారులు ఉన్నారు. ఇదిలావుండగా ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రస్తుతం జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో యువత వివరాలు ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. ఒక కుటుంబంలో యజమాని, భార్యతోపాటు ఇంట్లో ఉన్న పిల్లల విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేస్తున్నారు. విద్యార్హతల మేరకు త్వరలో వారికి రాత పరీక్షకు అవకాశం వస్తుందని స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు జిల్లా అధికారి ఉషారాణి తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, డిగ్రీ అర్హత ఉన్న ప్రతి యువకుడు/యువతి, గృహిణి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం వచ్చే సిబ్బందికి సర్టిఫికెట్లు కాపీలు అందించాలన్నారు.