డీఐజీగా కళ్యాణి బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:57 AM
రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ విశాఖపట్నం డీఐజీగా పీజీఎస్ కళ్యాణి గురువారం బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ విశాఖపట్నం డీఐజీగా పీజీఎస్ కళ్యాణి గురువారం బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖ జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు, ఇతర సబ్ రిజిస్ట్రార్లు కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు డీఐజీ (పూర్తి అదనపు బాధ్యతలు)గా వ్యవహరించిన కె.మన్మథరావు అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌గా వెనక్కి వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు.
మృతదేహంపై ఆభరణాలు చోరీ!
పోస్టుమార్టం అనంతరం గుర్తించిన మృతురాలి కుటుంబ సభ్యులు
గాజువాక పోలీసులకు ఫిర్యాదు
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహిళ దేహంపై ఉండాల్సిన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులకు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పెదగంట్యాడలోని నెల్లిముక్కు కాలనీకి చెందిన నామాల ప్రభావతి (32) ఈనెల ఆరో తేదీన గాజువాక పోలీస్ స్టేషన్ సమీపాన ఒక ఫార్మా కంపెనీ బస్సు ఢీకొనడంతో మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు గుమిగూడారు. ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందడంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గెట్‌ఎవే వాహనంలో కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మార్చురీకి అప్పగించినప్పుడు మృతదేహంపై ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని సిబ్బందికి అప్పగిస్తే వారు అక్కడి రికార్డులో నమోదుచేస్తారు. అనంతరం వాటిని మృతుల కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అయితే పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రభావతి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినప్పుడు మార్చురీ సిబ్బంది కేవలం ముక్కుపుడక, ఇత్తడి నత్తులు మాత్రమే వారికి అందజేశారు. ‘ఆమె శరీరంపై మూడు తులాల బంగారు గొలుసు, చేతికి ఉంగరం ఉండాలి కదా’ అని కుటుంబ సభ్యులు అడిగితే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. మృతురాలి చేతి వేలిని పరిశీలించగా ఉంగరం లేదు. దానిని తొలగించినట్టుగా ఉన్న మచ్చను చూపించి ఎవరో ఆభరణాలను చోరీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై మృతురాలి సోదరి బొడ్డు పైడిరత్నం గాజువాక ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసును క్రైమ్ పోలీసులకు అప్పగించారు. క్రైమ్ పోలీసులు దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి శరీరంపై ఆభరణాలు నిజంగా ఉండేవా? లేదా? అనేది నిర్ధారించుకునేందుకు ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆభరణాలు ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు వచ్చినవారిలో ఎవరైనా తీశారా?, లేక తర్వాత ట్రాఫిక్ పోలీసులు మృతదేహన్ని తరలించినప్పుడు జరిగిందా?, లేదా మార్చురీలో ఏమైనా జరిగి ఉంటుందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని గాజువాక క్రైమ్ పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశించినట్టు తెలిసింది.
వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్ మొరాయింపు
ఆధునికీకరించి ఆగస్టు 15న పునఃప్రారంభిస్తామని గత కమిషనర్ ప్రకటన
ఈలోగా ఆయన బదిలీ...ఇంకా బాధ్యతలు చేపట్టని కొత్త కమిషనర్
వెబ్‌సైట్ ప్రారంభంపై నోరు మెదపని అధికార వర్గాలు
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వెబ్‌సైట్ కొంతకాలంగా పనిచేయడం లేదు. దీనిని ఆధునికీకరిస్తున్నామని ఆగస్టు 15న పునఃప్రారంభిస్తామని గత కమిషనర్ తేజ్‌భరత్ వెల్లడించారు. వారం క్రితం ఆయన బదిలీ అయి వెళ్లిపోయారు. కొత్త కమిషనర్‌గా నియమితులైన ప్రఖర్ జైన్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఆగస్టు 15, ఆ తరువాత ఆదివారం సెలవు కావడం వల్ల సోమవారం వరకు కొత్త కమిషనర్ వచ్చే అవకాశం లేదని వీఎంఆర్‌డీఏ వర్గాల సమాచారం. అయితే చైర్మన్, సెక్రటరీ, అడిషనల్ కమిషనర్...ఇలా అనేక మంది ఉన్నతాధికారులు ఉన్నారు. ఆధునికీకరించిన వెబ్‌సైట్‌ను ముందుగా ప్రకటించినట్టు ఆగస్టు 15న ప్రారంభిస్తారా?, లేదంటే కొత్త కమిషనర్ వచ్చే వరకు వేచి చూస్తారా?...అనేది ఎవరూ చెప్పడం లేదు. వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశాల్లో అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని అమలు చేయడానికి టెండర్లు పిలుస్తున్నారు. ఆ వివరాలు ఏవీ అధికారికంగా వెల్లడించడం లేదు. గతంలో బోర్డు నిర్ణయాలను పూర్తిగా కాకపోయినా కొన్నింటినైనా వెంటనే అధికార వర్గాలు తెలిపేవి. వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేశారు. కూటమి ప్రభుత్వం కూడా అదే విధానం అనుసరిస్తోంది. బయటకు చెప్పకపోయినా వెబ్‌సైట్‌లో బోర్డు నిర్ణయాలను పెట్టేవారు. ఈ మధ్య కాలంలో బోర్డు సమావేశాలు, అందులో నిర్ణయాలు ఏవీ వెబ్‌సైట్‌లో లేవు. సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో పెడతామని, అన్ని విభాగాల్లో ఇప్పుడు ఏమి జరుగుతున్నదీ అందులో చూసి తెలుసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్‌సైట్, యాప్‌ల తయారీ కోసమే పది మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వెబ్‌సైట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.
శతాబ్ది ప్రాజెక్టులపై ఏయూ దృష్టి
డీపీఆర్‌ల తయారీ
ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల నుంచి
నిధులు సమీకరించేందుకు యత్నం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టులపై అధికారులు దృష్టిసారించారు. అందులో మెగా మెస్, హాస్టళ్ల నిర్మాణం, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, రీసెర్చ్ ల్యాబ్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బిల్డింగ్, క్యాంటీన్, హెరిటేజ్ బిల్డింగ్‌కు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు వీసీ ప్రొఫెసర్ డాక్టర్ జీపీ రాజశేఖర్ చర్యలు చేపడుతున్నారు. వాటికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతలను అధికారులకు అప్పగించారు. డీపీఆర్‌లు పూర్తయిన వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఆయా పనులకు సంబంధించి నిధుల సమీకరణలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా పూర్వ విద్యార్థులు, పరిశ్రమల నుంచి కొంత కార్పస్ ఫండ్ సమీకరించే దిశగా అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. కొన్ని సంస్థలు, ప్రముఖ పూర్వ విద్యార్థులు నిధులు అందించేందుకు ముందుకు వచ్చినట్టు ఏయూ అధికారులు చెబుతున్నారు.
త్వరితగతిన పూర్తిచేసేలా..
కీలక ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వీటిలో కొన్ని ప్రాజెక్టులు అయినా పూర్తి చేయాలని, 2027 ఆఖరు నాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రారంభించిన ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వం కూడా నిధులు అందించేందుకు సిద్ధంగా ఉందని, దాతలు, పూర్వ విద్యార్థులు నుంచి నిధులు అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు, ప్రముఖ ఊర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించామని, ఇవి భవిష్యత్తులోనూ కొనసాగుతాయన్నారు.
గ్యాస్ వినియోగదారులూ ఈకేవైసీ తప్పనిసరి
రేపటి వరకే గడువు
జాయింట్ కలెక్టర్ విద్యాధరి
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు శనివారం (ఈనెల 15వ తేదీ)లోగా ఈకేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ సరఫరా జరిగేలా చూడడం, అక్రమ వినియోగాన్ని నివారించడం కోసం ఈ ఈకేవైసీ ప్రక్రియ చేపట్టినట్టు పేర్కొన్నారు. వినియోగదారులు ఇంటి నుంచే ఈ ప్రక్రియ (హెచ్‌పీ పే యాప్-హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్...ఐవోసీఎల్, హలో బీపీసీఎల్ యాప్-బీపీసీఎల్ మొబైల్ యాప్‌ల ద్వారా) పూర్తిచేసుకునే వీలుందన్నారు. అలాగే గ్యాస్ ఏజెన్సీల వద్ద, సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో కూడా ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉందన్నారు. సందేహాలుంటే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాలని ఆమె సూచించారు.