Share News

ప్రకృతి సేద్యంలో జ్యోతి

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:37 AM

సేంద్రీయ పంటల సాగులో సత్తాచాటుతున్న సంతపాలెం మహిళ రైతు సాధికార సంస్థ గుర్తింపు ఐరోపాలో పర్యటించే రాష్ట్ర బృందంలో చోటు ఏడు దేశాల్లో అధ్యయనానికి పయనమైన లాలం జ్యోతి రాంబిల్లి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):

ప్రకృతి సేద్యంలో జ్యోతి
లాలం జ్యోతి

సేంద్రీయ పంటల సాగులో సత్తాచాటుతున్న సంతపాలెం మహిళ

రైతు సాధికార సంస్థ గుర్తింపు

ఐరోపాలో పర్యటించే రాష్ట్ర బృందంలో చోటు

ఏడు దేశాల్లో అధ్యయనానికి పయనమైన లాలం జ్యోతి

రాంబిల్లి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెల్చూరు పంచాయతీ శివారు సంతపాలెం గ్రామానికి చెందిన లాలం జ్యోతి, ఐరోపా దేశాల్లో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ఆర్గానిక్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లనుసందర్శించడానికి వెళ్లే రాష్ట్ర బృందంలో చోటు లభించింది. ప్రకృతి వ్యవసాయంలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ నాణ్యమైన, అధిక పంట దిగుబడులు సాధిస్తున్న ఆమె ప్రతిభను రైతు సాధికార సంస్ధ (ఆర్‌వైఎస్‌ఎస్‌) గుర్తించింది. దీంతో ఏడు దేశాల్లో 30 రోజుల పర్యటన నిమిత్తం లాలం జ్యోతి మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరారు.

కె.కోటపాడు మండలం మల్లంపాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి జ్యోతికి, రాంబిల్లి మండలం వెల్చూరు పంచాయతీ శివారు సంతపాలెం గ్రామానికి చెందిన లాలం వరహామూర్తితో 2018లో వివాహం జరిగింది. అప్పటికి జ్యోతి డిగ్రీ పూర్తిచేసింది. వరహామూర్తి పరవాడ ఫార్మా సిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వివాహమైన తరువాత జ్యోతి ఎంబీఏ పూర్తిచేసి విజయవాడలో ఒక ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగంలో చేరారు. గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఉద్యోగం వదిలేసి సంతపాలెం తిరిగి వచ్చేశారు. గర్భందాల్చిన తరువాత శిశువు తగినంత బరువు పెరగక పోవడంతో తినే ఆహారం, నాణ్యత, పోషక విలువల గురించి తీవ్రంగా ఆలోచించారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండించే పంటలు ఆరోగ్యానికి హానికలిస్తాయని గుర్తించిన ఆమె.. రసాయన రహిత వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ప్రకృతి సేద్యం వల్ల పంట దిగుబడులు తగ్గాతాయన్న కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సంతపాలెంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన ఆమె సేంద్రీయ వ్యవసాయం చేపట్టారు. 2022లో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు. మొదటి ఏడాదిలోనే ఆమె ప్రతిభను గుర్తించిన రైతు సాధికార సంస్థ అధికారులు రాంబిల్లి మండల మెంటార్‌గా నియమించారు. మరుసటి ఏడాది ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన పంటగా కొబ్బరి మొక్కలు నాటారు. ఇందులో అంతర పంటలుగా బొప్పాయి, నిమ్మ, జామ, వంగ, మిరప, టమాటా, బీన్స్‌, అలసంద, మొక్కజొన్న, బంతిపూలు, పలు రకాల ఆకు కూరలు వంటి మొత్తం 25 రకాల పంటలను ఏడాది పొడవునా పండిస్తున్నారు. తన పొలాన్నే ఒక అభ్యాసన ప్రయోగశాలగా మార్చుకున్నారు. జీవామృతం, బీజామృతం, మల్చింగ్‌ పద్ధతులను పాటించారు. పొలంలో వేసిన పంటలు, అయిన ఖర్చులు, నేల భౌతిక (ఆరోగ్యం) పరిస్థితిని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చారు. పురుగు మందుల ఉధృతిని తగ్గించమే కాకుండా నేల సారాన్ని గణనీయంగా పెంచారు. సాగు ఖర్చులు బాగా తగ్గడం, నాణ్యమైన మంచి పంట దిగుబడులు సాధించడంతో కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యింది. ఈ నేపథ్యంలో యూరప్‌ పర్యటనకు వెళుతున్న సందర్భంగా లాలం జ్యోతి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన ఐరోపా దేశాల్లో ప్రకృతి సేద్యంపై మరింత అవగాహన పెంచుకోవడానికి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ఆర్గానిక్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లనుసందర్శించడానికి వెళ్లే రాష్ట్ర బృందంలో తనకు చోటు లభించడం ఎంతో ఆనందంగా వుందని అన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:37 AM