లక్ష్యానికి కొద్దీ దూరంలో...
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:37 AM
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఆదాయం ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. మొత్తం పది సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.219.49 కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే సుమారు 15 శాతం తక్కువగా.. రూ.187.04 కోట్లు మాత్రమే వచ్చింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా వుండడం, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు అంతగా లేకపోవడం ప్రధాన కారణాలుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 15 శాతం లోటు
ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.219 కోట్లు టార్గెట్
వసూలైంది రూ.187 కోట్లు
లక్ష్యాన్ని అధిగమించిన ‘నక్కపల్లి’
చోడవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఆదాయం ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. మొత్తం పది సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.219.49 కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే సుమారు 15 శాతం తక్కువగా.. రూ.187.04 కోట్లు మాత్రమే వచ్చింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా వుండడం, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు అంతగా లేకపోవడం ప్రధాన కారణాలుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.
జిల్లాలో మొత్తం పది సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు వున్నాయి. నాలుగేళ్ల క్రితం అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం.. తరువాత రెండేళ్లపాటు భూముల రిజిస్ట్రేషన్ విలువను గణనీయంగా పెంచేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే స్వల్పంగా పెంచింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పెంచిన భూముల విలువ ప్రభావం ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై పడుతున్నది. ప్రభుత్వం ప్రతి సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి నెల వారీగా ఆదాయ లక్ష్యాలను విధిస్తుంది. జిల్లాలో పది సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకుగాను నక్కపల్లి మినహా మిగిలిన కార్యాలయాలు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఆదాయ లక్ష్యంలో 112.26 శాతంతో నక్కపల్లి మొదటి స్థానంలో వుండగా, 97.42 శాతంతో మాడుగుల రెండో స్థానంలో వుంది. కాగా 78.16 శాతంతో నర్సీపట్నం చివరి స్థానంలో వుంది. ఆదాయ పరంగా చూస్తే. రూ.35.75 కోట్లతో అనకాపల్లి మొదటిస్థానంలో, రూ.29.39 కోట్లతో లంకెలపాలెం రెండో స్థానంలో వున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగానే వచ్చినప్పటికీ, వివిధ కారణాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్టు అధికారవర్గాలు చెపుతున్నాయి. చోడవరం, మాడుగుల, కె.కోటపాడు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, స్థలాల మార్కెట్ ధరకన్నా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ అధికంగా వుండడంతో ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలు తగ్గినట్టు సమాచారం. జాతీయ రహదారి పక్కన సబ్బవరం నుంచి పాయకరావుపేట వరకు పలుచోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినప్పటికీ స్థలాల ధరలు చాలా అధికంగా వుండడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంలేదు. ఈ కారణాల వల్ల రిజిస్ట్రేన్ల ఆదాయం అనుకున్నంత రాలేదని అధికారులు చెబుతున్నారు.