Share News

కొన్ని గంటలే...

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:33 AM

ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమానికి గడువు మరో రోజు మాత్రమే మిగిలింది.

కొన్ని గంటలే...

నేటితో ముగియనున్న ‘సర్‌’ ఎన్యూమరేషన్‌

జిల్లాలో 100 శాతం ఓటర్లకు ఫారాల పంపిణీ

99.25 శాతం ఫారాలు డిజిటలైజేషన్‌

గడువులోగా నూరు శాతం సాధిస్తామని అధికారుల ధీమా

----

జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ‘సర్‌’ వివరాలు

------

నియోజకవర్గం మొత్తం డిజిటలైజ్డ్‌ శాతం

ఓటర్లు ఫారాలు

నర్సీపట్నం 2,14,090 2,13,833 99.88

చోడవరం 2,19,895 2,18,526 99.38

పాయకరావుపేట 2,53,393, 2,51,446 99.23

మాడుగుల 1,90,545 1,88,868 99.12

అనకాపల్లి 2,15,615 2,13,718 99.12

ఎలమంచిలి 2,08,851 2,06,246 98.76

-----

అనకాపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమానికి గడువు మరో రోజు మాత్రమే మిగిలింది. 14వ తేదీ (మంగళవారం) అర్ధరాత్రితో ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ముగియనుంది. దీంతో బీఎల్వోలు, ఇతర అధికారులు, సిబ్బంది ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియలో తలమునకలై వున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేసిన బులెటెన్‌ ప్రకారం జిల్లాలో 13,02,389 మంది ఓటర్లకు గాను 13,02,388 మందికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయ్యింది. వీటిలో 12,92,029 (99.25 శాతం) ఫారాలను ఓటర్ల నుంచి తిరిగి స్వీకరించి డిజిటలైజేషన్‌ చేశారు. మిగిలిన ఫారాలను కూడా మంగళవారంలోగా డిజిటలైజేషన్‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మొదటి స్థానంలో నర్సీపట్నం...చివరి స్థానంలో ఎలమంచిలి

జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ ప్రక్రియ వంద శాతం ఇప్పటికే పూర్తికాగా, ఫారాల డిజిటైజేషన్‌ శరవేగంగా సాగుతున్నది. మంగళవారం వరకే గడువు వుండడంతో అధికార యంత్రాంగం పూర్తిగా దీనిపైనే దృష్టి పెట్టింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు పూర్తయిన ఫారాల డిజిటైజేషన్‌ గణాంకాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం మొదటి స్థానంలో వుండగా, ఎలమంచిలి నియోజకవర్గం చివరి స్థానంలో వుంది.

నేటితో ముగియనున్న గడువు

సుమారు నెల రోజుల క్రితం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం మంగళవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఇంతవరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోని వారు, ఇప్పటికే ఫారాలు తీసుకొని తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వని వారు వెంటనే ఫారాలను అందజేయాలని సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన ఫారాలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇంకా 9,752 ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటటైజేషన్‌ చేయాల్సి వుందని, మంగళవారం సాయంత్రానికి ఈ ప్రక్రియను పూర్తిచేసి శత శాతం లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 01:33 AM