Share News

జంక్షన్లు జామ్‌

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:50 AM

భోగాపురంలో అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)పై ప్రయాణం చుక్కలు చూపిస్తోంది.

జంక్షన్లు జామ్‌

భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తరువాత జాతీయ రహదారిపై పెరిగిన ట్రాఫిక్‌ సమస్య

హనుమంతవాక, కారుషెడ్‌, కొమ్మాదిల్లో సిగ్నల్స్‌ వద్ద 15 నిమిషాల చొప్పున వెయిటింగ్‌

ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే 3 గంటల ముందు బయలుదేరాల్సిందే...

నరకం చూస్తున్న ప్రయాణికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)పై ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. ప్రతి సిగ్నల్‌ వద్ద కనీసం ఐదు నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. అతి ముఖ్యమైన సిగ్నళ్లను దాటడానికి 15 నిమిషాలు పడుతోంది.

భోగాపురం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం సగటున 25 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అంటే 50 సర్వీసులు. ఒక్కో విమానంలో సగటున 150 మంది చొప్పున ప్రయాణించినా రోజుకు 7,500 మంది. వారిలో సుమారు 70 శాతం (5,250 మంది) మంది విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి వెళ్లివస్తున్నారు. ఈ వాహనాలు హనుమంతవాక, ఎండాడ, కారుషెడ్‌ జంక్షన్‌, కొమ్మాది, ఆనందపురం మీదుగా భోగాపురం వెళుతున్నాయి. ఈ మార్గంలో అసలే ట్రాఫిక్‌ ఎక్కువ. ఇప్పుడు అదనంగా ఎయిర్‌పోర్టు వాహనాలు తోడు కావడంతో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగింది. ఈ సమస్య వస్తుందని ముందే గుర్తించి జాతీయ రహదారిపై 12 ఫ్లైఓవర్ల నిర్మాణానికి నేషనల్‌ హైవే అథారిటీ ముందుకువచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు పేరు చెప్పి వాటి నిర్మాణాన్ని ఆపేసింది. దాంతో అంతా ఊహించినట్టుగానే విమానాశ్రయం ప్రారంభమైన తరువాత ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

సిగ్నళ్లు ఆపేసి ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

పోలీసులు ఈ ట్రాఫిక్‌ను నియంత్రించడానికి కీలకమైన ప్రాంతాల్లో పీక్‌ టైమ్‌లో ిసగ్నళ్లను ఆపేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నళ్లు 30 సెకండ్ల నుంచి 120 సెకండ్లలో రెడ్‌ నుంచి గ్రీన్‌ లోకి మారతాయి. ఆ పరిమిత సమయంలో ఆయా మార్గాల్లో వాహనాలు 80 శాతం ముందుకు వెళ్లిపోతాయి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇసుకతోట, హనుమంతవాక, ఎండాడ, కారుషెడ్‌, కొమ్మాది జంక్షన్లలో ఈ సమయం సరిపోవడం లేదు. దాంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు హనుమంతవాకలో సిగ్నల్‌ పడితే మెడికవర్‌ ఆస్పత్రి వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. అటు నుంచి వచ్చేటపుడు కారుషెడ్‌ జంక్షన్‌ వద్ద సిగ్నల్‌ పడితే అటు వైపు దుర్గా థియేటర్‌ (కన్వెన్షన్‌ సెంటర్‌) వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. దాంతో పోలీసులు సిగ్నళ్లను ఆపేసి, నలురుగు కానిస్టేబుళ్లు నాలుగు వైపులా నిలబడి ఎటు వైపు ఎక్కువ వాహనాలు ఉన్నాయో చూసుకొని వాటికి మందుకు క్లియరెన్స్‌ ఇస్తున్నారు. అప్పటివరకూ మిగిలిన వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో ఆయా జంక్షన్లలో ఐదు నుంచి పది నిమిషాల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ విధంగా ప్రయాణిస్తే ఇటు నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి 1.30 నుంచి 1.40 గంటలు పడుతోంది. అటు నుంచి రావడానికి 1.20 గంటల నుంచి 1.30 గంటలు పడుతోంది. ఇదంతా కేవలం 45 కి.మీ. ప్రయణానికే.

మూడు గంటల ముందే ప్రయాణం

విశాఖలో విమానాశ్రయం ఉన్నప్పుడు బోర్డింగ్‌ టైమ్‌కు అంటే ఒక గంట ముందు అక్కడ ఉంటే సరిపోయేది. అంటే గంటన్నర ముందు ఇంటి నుంచి బయలుదేరితే విమానాశ్రయానికి అరగంటలో చేరుకునేవారు. ఇప్పుడు భోగాపురం వెళ్లాల్సి ఉండడం, ట్రాఫిక్‌ ఇబ్బందుల భయంతో కనీసం మూడు గంటల ముందే బయలుదేరాల్సి వస్తోంది. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరులకు విశాఖ నుంచి విమానంలో గంటన్నర నుంచి రెండు గంటల ప్రయాణమే అయినా ఇంటి దగ్గర మాత్రం మూడు గంటల మందు బయలుదేరాల్సి వస్తున్నది. ప్రయాణానికి 1.30-1.45 గంటలు పడుతోంది. మిగిలిన సమయం విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాస్‌ తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. వీటికి అధికారులు పరిష్కారాలు వెదుకుతుంటే...ప్రజా ప్రతినిధులు మాత్రం వారే క్రమంగా అలవాటు పడతారంటూ లైట్‌గా తీసుకుంటున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:50 AM