Share News

జంక్షన్‌...ట్రాఫిక్‌ టెన్షన్‌

ABN , Publish Date - Jun 07 , 2026 | 01:09 AM

భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్నదనగానే అందరి దృష్టి ఆనందపురం జంక్షన్‌పైకే వెళుతోంది.

జంక్షన్‌...ట్రాఫిక్‌ టెన్షన్‌

ఆనందపురంలో ముందుకు కదలని ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రతిపాదన

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే సమస్య మరింత తీవ్రం

అనేక దఫాలు అధికారుల పరిశీలన

ఒక్క ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్నదనగానే అందరి దృష్టి ఆనందపురం జంక్షన్‌పైకే వెళుతోంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేవారికి అదొక గండం. ఇప్పుడు ఆ ప్రాంతం మరింత కీలకంగా మారింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుండడం, గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ సహా అనేక కంపెనీలు రానుండడంతో అటు వైపు మరింత ట్రాఫిక్‌ పెరగనున్నది. వీటన్నింటికి పరిష్కారాలు ఏమిటి?

జాతీయ రహదారి-16 విస్తరణలో భాగంగా ఆనంపురం జంక్షన్‌ను గందరగోళం చేశారనే విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లాల్సిన వాహనాలు ఆ జంక్షన్‌లో కిందికి దిగి పూలమార్కెట్‌ మీదుగా మళ్లీ హైవే ఎక్కాలి. అదే ఇప్పుడు సమస్యగా పరిణమించింది. పూలు, కూరగాయల మార్కెట్‌ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. రోడ్ల పక్కనే విక్రయాలు జరుగుతాయి. ఆర్టీసీ బస్సులు, ఆటోలు అన్నీ అక్కడే ఆపుతారు. ఆ జంక్షన్‌ దాటడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. అదే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటే పది నిమిషాలు తీసుకుంటుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి సమస్యలు పరిష్కరించాలని ఏడాదికాలంగా చర్చలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పూర్వ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అక్కడికి వెళ్లి అన్నీ పరిశీలించి చర్చించారు. అంతకు ముందు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌, అధికారులు వెళ్లి చూశారు. తాజాగా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ కూడా అధికారులతో కలిసి పరిశీలించారు.

ఇవీ ప్రతిపాదనలు

- ఈ జంక్షన్‌లో 400 మీటర్ల పొడవున ఫ్లైఓవర్‌ ఒకటి నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి అనుమతి కూడా లభించింది. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు కూడా నిర్దేశించారు.

- పూల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. అక్కడకు సమీపంలో రైతుబజార్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమిలో మార్కెట్‌ పెట్టాలని అనుకున్నారు. దీనిపై మళ్లీ చర్యలు లేవు. చర్చలు లేవు.

- ఆనందపురం జంక్షన్‌ నుంచి వెళ్లే, అక్కడకు కనెక్ట్‌ అయ్యే అన్ని సర్వీస్‌ రహదారులను విస్తరించాలని కూడా ప్రతిపాదించారు.

జాతీయ రహదారిలో మార్పులు అవసరం

అనకాపల్లి నుంచి వేసిన జాతీయ రహదారి కూడా ఆనందపురం వద్ద కలుస్తుంది. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి విశాఖ సిటీలో సిగ్నళ్లు ఎక్కువ కాబట్టి చాలామంది అనకాపల్లి జాతీయ రహదారిపైకి చేరుకొని, ఆనందపురం మీదుగా భోగాపురం వెళ్లాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీఎంఆర్‌డీఏ అడవివరం నుంచి శొంఠ్యాం వరకు మాస్టర్‌ ప్లాన్‌ రహదారిని విస్తరించింది. అయితే ఆ మార్గంలో సర్వీస్‌ రోడ్డులో సుమారుగా ఏడు కి.మీ. ప్రయాణిస్తే తప్ప జాతీయ రహదారిపైకి చేరుకునే అవకాశం లేదు. అదేవిధంగా విశాఖ నుంచి గూగుల్‌ డేటా సెంటర్‌కు వెళ్లాలన్నా ఆనందపురం నుంచి గండిగుండం వరకు సుమారు 15 కి.మీ. సర్వీస్‌ రోడ్డులోనే వెళ్లాలి. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సర్వీసు రహదారులతో సరైన కనెక్టివిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తర్లువాడ బిజీగా మారడం, భోగాపురం వెళ్లడానికి అనకాపల్లి జాతీయ రహదారిని అత్యధికులు వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నందున ఆ మార్గంలో కూడా తగిన మార్పులు చేయాల్సి ఉంది. ఇవన్నీ భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యేలోగా జరిగితే మంచి ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకున్నాక వాటిని అమలు చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 01:09 AM