రిమాండ్ ఖైదీ విడుదల కోసం న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ!
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:25 AM
గంజాయి కేసులో రిమాండ్ ఖైదీని విడిపించడానికి న్యాయమూర్తి సంతకం, న్యాయస్థానం అధికారిక ముద్రను ఫోర్జరీ చేసిన ఉదంతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో న్యాయవాది సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు ముద్ర కూడా...
మహిళా న్యాయవాది సహా ముగ్గురి అరెస్టు
నర్సీపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో రిమాండ్ ఖైదీని విడిపించడానికి న్యాయమూర్తి సంతకం, న్యాయస్థానం అధికారిక ముద్రను ఫోర్జరీ చేసిన ఉదంతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో న్యాయవాది సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పట్టణ సీఐ ఎస్‌కే గఫూర్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లి జిల్లా కైలాసపురానికి చెందిన నరేష్ రాజు శ్రీధరన్ (27) పది కిలోల గంజాయి తరలిస్తూ సెప్టెంబరు తొమ్మిదో తేదీన జిల్లాలోని కోటవురట్ల పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీధరన్‌ను బెయిల్‌పై విడుదల చేయించడానికి గుర్తుతెలియని వ్యక్తులు రిలీజ్ వారెంట్, బాండ్, బెయిల్ వారెంట్‌లను తయారుచేశారు. ఆ పత్రాలపై న్యాయమూర్తి సంతకం, కోర్టు ముద్రను ఫోర్జరీ చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలు అధికారులకు పంపించారు. జైలు అధికారులకు అనుమానం వచ్చి నర్సీపట్నం సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టుకు పంపించారు. వాటిని పరిశీలించిన కోర్టు అధికారులు ఆ పత్రాలు నకిలీవని నిర్ధారించారు. ఈ విషయమై కోర్టు సూపరింటెండెంట్ ఈ నెల 13న నర్సీపట్నం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు సెంట్రల్ జైలు, వివిధ ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, ఇతర సాంకేతిక ఆఽధారాలతో విచారించి ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. నర్సీపట్నం అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సంపదరావు రవికుమార్ అలియాస్ రవి, విశాఖపట్నం జిల్లా కోర్టు అడ్వకేట్ మండల అనురాధ, ఆమె భర్త రిక్కి విప్లవమూర్తి అలియాస్ ఆకాష్‌లపై మంగళవారం కేసు నమోదుచేశారు. బుధవారం ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని సీఐ గఫూర్ తెలిపారు.