Share News

ఉల్లాస్‌ంగా.. ఉత్సాహంగా..

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:11 AM

జిల్లాలో నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఉల్లాస్‌ (అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమం ఆశాజనకంగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు అధికారులు అంచనా వేయగా, వారిని దశలవారీగా అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే రెండు విడతల్లో గణనీయమైన పురోగతి సాధించిన అధికారులు, తాజాగా మూడో విడతలో 93 వేల మందిని అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపట్టారు.

ఉల్లాస్‌ంగా.. ఉత్సాహంగా..
నక్కపల్లిలో నిరక్షరాస్యుల శిక్షణ శిబిరంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ (ఫైల్‌ ఫొటో)

వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి

జిల్లాలో 2.5 లక్షల మంది నిరక్షరాస్యులు

గత రెండేళ్లలో 93 వేల మందికి అక్షరాలు

మూడో విడత మరో 93 వేల మంది ఎంపిక

చదువుతోపాటు ప్రభుత్వ పథకాలు, డిజిటల్‌ సేవలపై అవగాహన

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఉల్లాస్‌ (అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమం ఆశాజనకంగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు అధికారులు అంచనా వేయగా, వారిని దశలవారీగా అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే రెండు విడతల్లో గణనీయమైన పురోగతి సాధించిన అధికారులు, తాజాగా మూడో విడతలో 93 వేల మందిని అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపట్టారు.

ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 11,900 మందిని అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువ వుండడం, మిగిలిన వారిని అక్షరాస్యులుగా చేయడానికి చాలా ఏళ్లు పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో 2025-26లో నిర్వహించిన రెండో విడత ఉల్లాస్‌ కార్యక్రమంలో ఏకంగా 81 వేల మందిని అక్ష్యరాస్యులుగా మార్చారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది మార్చితో విజయవంతంగా ముగిసింది. జిల్లా వయోజన విద్యాశాఖ అధికారులు ఉల్లాస్‌ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దఫా 93 వేల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే జీవీఎంసీ అనకాపల్లి జోన్‌తోపాటు నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, అన్ని మండలాల్లో నిరక్ష్యరాస్యులను ఎంపిక చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, వృద్ధులను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అక్షరాస్యతతోపాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన, డిజిటల్‌ సేవల వినియోగంపై కూడా శిక్షణ ఇస్తున్నారు. ఉల్లాస్‌ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అక్షరాస్యతతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, పిల్లల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.

అక్షరాస్యత సాధన లక్ష్యాన్ని చేరుకుంటాం

చిన్నికృష్ణ, జిల్లా వయోజన విద్య నోడల్‌ అధికారి

జిల్లాలో ఇప్పటికే రెండు విడతల్లో సాధించిన ఫలితాలే మూడో విడతలో కూడా సాధిస్తామన్న నమ్మకం వుంది. అక్షరాస్యత కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం చురుగ్గా పనిచేస్తున్నది. వయోజనుల అక్షరాస్యత సాధన విషయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం.

Updated Date - Jun 24 , 2026 | 12:11 AM