Share News

ఉల్లాసంగా, ఉత్సాహంగా

ABN , Publish Date - May 29 , 2026 | 12:40 AM

మహానాడును పురస్కరించుకుని గురువారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా

రెండో రోజు ఘనంగా మహానాడు

ప్రతి క్లస్టర్‌లో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

సీనియర్‌ కార్యకర్తలకు సత్కారాలు

పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

అనంతరం మహానాడు కార్యక్రమాల వీక్షణ

‘తూర్పు’లో 103 కిలోల కేకు కట్‌ చేసిన ఎమ్మెల్యే వెలగపూడి

ఎన్టీఆర్‌ బ్లడ్‌బ్యాంకులో రక్తదానం

విశాఖపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి):

మహానాడును పురస్కరించుకుని గురువారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. వీటికి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించారు. గురువారం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 103వ జయంతి కావడంతో ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించారు. ఉదయం ఆర్కే బీచ్‌ రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ, వీఎంఆర్‌డీఎ మాజీ చైర్‌పర్సన్‌ అక్కరమాని నిర్మల, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణం, సమావేశ మందిరంలో గల ఎన్టీఆర్‌ విగ్రహాలకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని పార్ట్టీ జాతీయ వర్కింగ్‌ అధ్యక్షుడు నారా లోకేశ్‌ ప్రకటన చేయడంపై హర్షం ప్రకటిస్తూ తెలుగు మహిళలు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు.

భీమిలి నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో మహానాడు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ కార్యకర్తలను ఆయన సత్కరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని శివాజీపాలెం, ఆరిలోవల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని క్యాడర్‌ను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్‌ 103వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే వెలగపూడి, ఆయన తనయుడు ప్రతాపరుద్ర, పార్టీ పరిశీలకుడు శివరామకృష్ణలు 103 కిలోల భారీ కేకు కట్‌ చేశారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ నేతృత్వంలో అన్ని క్లస్టర్‌లలో మహానాడు నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గంలోని రైల్వేన్యూకాలనీలో గల సుబ్బలక్ష్మి కల్యాణ మండపం, కంచరపాలెం, మాధవధార, సీతమ్మధారల్లో మహానాడు నిర్వహించారు. పార్టీ నేతలు తొలుత నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పించి అనంతరం కేకు కట్‌చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపాలెంలో ఏర్పాటుచేసిన మహానాడులో ఎమ్మెల్యే పి.గణబాబు పాల్గొని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. పాత ఐటీఐ జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎంపీ శ్రీభరత్‌ హాజరయ్యారు. పెందుర్తిలో పార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ నేతృత్వంలో పార్టీ నాయకులు తొలుత ఊరేగింపు నిర్వహించారు. మాజీ మేయర్‌ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాజువాక నియోజకవర్గంలోని రాసాలమ్మ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. మహానాడు లైవ్‌లో రెండో రోజు విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 25 వేల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా గురువారం సాయంత్రం మహానాడు ముగిసిన అనంతరం ఎంపీ, ఇతర నాయకులు మాట్లాడుతూ లైవ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - May 29 , 2026 | 12:40 AM