నరక ప్రయాణం
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:02 AM
భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు రహదారి దారుణంగా తయారైంది. ఇటు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇటు వెంకన్నపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర అత్యధిక భాగం పూర్తిగా ఛిద్రమైంది. అడుగడుగునా గోతుల మయం కావడంతో అన్ని రకాల వాహనదారులు, ప్రయాణికులు భూలోకంలోనే నరకం చవిచూస్తున్నారు.
దారుణంగా తయారైన చోడవరం- వెంకన్నపాలెం రోడ్డు
గోవాడ, అంభేరుపురం, వెంకన్నపాలెం వద్ద భారీ గోతులు
వాహనదారులు, ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు
15వ తేదీనాటికి పనులు చేయిస్తామన్న ఆర్‌అండ్‌బీ అధికారులు
అనుమానమేనంటున్న స్థానికులు
చోడవరం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు రహదారి దారుణంగా తయారైంది. ఇటు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇటు వెంకన్నపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర అత్యధిక భాగం పూర్తిగా ఛిద్రమైంది. అడుగడుగునా గోతుల మయం కావడంతో అన్ని రకాల వాహనదారులు, ప్రయాణికులు భూలోకంలోనే నరకం చవిచూస్తున్నారు. ఈ రోడ్డు మీదుగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. నిత్య వాహనాలతో రద్దీగా వుంటుంది. చోడవరం- వెంకన్నపాలెం మధ్య ప్రయాణ సమయం పది నిమిషాలకు మించదు. కానీ గోతుల కారణంగా 20 నుంచి 30 నిమిషాలు పడుతున్నదని వాహనదారులు చెబుతున్నారు. అడపాదడపా గోతులను మెటల్, క్రషర్ బుగ్గి మిక్చర్‌తో తాత్కాలికంగా కప్పుతున్నప్పటికీ వాహనా రద్దీ కారణంగా వారం, పది రోజులకే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తున్నది. ప్రత్యేకించి గోవాడ, అంభేరుపురం, వెంకన్నపాలెం వద్ద రోడ్డుపై భారీ గోతులు ఏర్పడి, కొద్దిపాటి వర్షం కురిసినా నీరు నిలిచిపోయి పంట కుంటలను తలపిస్తున్నాయి. ఏ గొయ్యి ఎంత లోతు వుందో అంచనా వేయలేక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఆటోలు, కార్లు గోతుల్లో నుంచి వెళుతుంటే విడిభాగాలు దెబ్బతింటున్నాయి. రెండు వారాల క్రితం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి గోవాడ, అంభేరుపురం వద్ద గోతులను మెటల్ వేయించి కప్పించారు. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు మెటల్ లేచపోయి గోతులు దర్శనమిస్తున్నాయి.
చోడవరం- వెంకన్నపాలెం రోడ్డులో గోవాడ, అంభేరుపురం వద్ద రహదారి అత్యంత దారుణంగా తయారుకావడానికిగల కారణాలను అధికారులు గుర్తించడంలేదు. ఈ రెండు గ్రామాల వద్ద మెయిన్ రోడ్డుపై కురిసిన వర్షం నీటితోపాటు ఇరువైపుల వున్న ఇళ్లల్లో నుంచి వాడుక నీరు రోడ్డుపైకి వస్తున్నది. డ్రైనేజీ కాలువలు లేకపోవడం, ఇరువైపులా మట్టి పేరుకుపోయి రోడ్డుకన్నా ఎత్తుగా వుండడంతో వర్షం నీరు పక్కకు పోకుండా రహదారిపైనే నిలిచిపోతున్నది. వాహనాల టైర్ల ఒత్తిడికి రోడ్డు ఛిద్రమే మరిన్ని గోతులు ఏర్పడుతున్నాయి. గోవాడ, అంబేరుపురం, వెంకన్నపాలెం గ్రామాల వద్ద స్థానిక పంచాయతీ అధికారులు డ్రైనేజీ కాలువలు నిర్మిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ రోడ్డును అభివృద్ధి చేసినప్పటికీ డ్రైనేజీల కాలువలు నిర్మించకపోతే ప్రయోజనం వుండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
15వ తేదీనాటికి రోడ్డు నిర్మాణం పూర్తయ్యేనా!
చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో స్థానిక న్యాయవాదులు కోర్టులో కేసు వేశారు. ఇటీవల వాయిదాకు హాజరైన ఆర్ అండ్‌బీ ఈఈ రంగనాథ్, ఆగస్టు 15వ తేదీనాటికి కాంట్రాక్టర్‌తో రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయిస్తామని స్థానిక అదనపు జిల్లా జడ్జికి లిఖిత పూర్వకంగా అఫిడవిట్ సమర్పించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే మరో 11 రోజుల్లో చోడవరం- వెంకన్నపాలెం మధ్య రోడ్డు అభివృద్ధి పనులు పూర్తికావడం కష్టమేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.