జోన్ కల సాకారం
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:21 AM
ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్’ భనవంలో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ సోమవారం అత్యంత నిరాడంబరంగా ప్రారంభమైంది. ఎటువంటి హడావిడి చేయకుండా చాలా సాధారణ కార్యాలయంలా జోన్‌ను ఆపరేషన్‌లోకి తీసుకువచ్చారు.
విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రారంభం
జీఎంకు శుభాకాంక్షలు తెలిపిన యూనియన్ నాయకులు
ఉద్యోగులు అందరికీ మిఠాయిల పంపిణీ
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్’ భనవంలో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ సోమవారం అత్యంత నిరాడంబరంగా ప్రారంభమైంది. ఎటువంటి హడావిడి చేయకుండా చాలా సాధారణ కార్యాలయంలా జోన్‌ను ఆపరేషన్‌లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైల్వేజోన్ పోరాట కమిటీ కన్వీనర్ చలసాని గాంధీ యూనియన్ నాయకులతో కలిసి వెళ్లి జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు. అక్కడి అధికారులు, ఉద్యోగులు అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ జోన్ రాష్ట్రాభివృద్ధికి, పారిశ్రామిక పురోగతికి, ఉద్యోగ అవకాశాల విస్తరణకు ఆలంబనగా నిలవాలని ఆకాంక్షించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి కమిటీ తరఫున అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంపై దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కొత్త రైల్వే జోన్ ప్రారంభంపై విశాఖ ఎంపీ శ్రీభరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, సీపీఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి తదితరులు హర్షం వ్యక్తంచేశారు. ఇదిలావుండగా సిరిపురంలోని కొత్త జోన్ కార్యాలయంలోకి అక్కడి ఉద్యోగులను తప్ప ఇంకెవరినీ అనుమతించలేదు. ఉద్యోగులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అనుమతించారు.
అవే బోర్డులు..పేర్లే మార్పు
విశాఖపట్నం కేంద్రంగా పనిచేసిన వాల్తేరు డివిజన్ మే 31వ తేదీ వరకు తూర్పు కోస్తా జోన్‌లో ఉండేది. దాంతో విశాఖపట్నంలోని అన్ని రైల్వే కార్యాలయాల బోర్డుపైన అదే పేరు ఉండేది. ఇప్పుడు వాల్తేరు డివిజన్‌కు బదులుగా విశాఖపట్నం డివిజన్, తూర్పు కోస్తా జోన్‌కు బదులు దక్షిణ కోస్తా జోన్ కావడంతో పాత బోర్డులపై కొత్త స్టిక్కర్లు అంటించి అధికారులు మేనేజ్ చేశారు. కొత్త బోర్డుల ఏర్పాటుకు ఇంకొంత సమయం పడుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి.