Share News

జోన్‌ పితలాటకం

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:53 AM

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు చేరింది.

జోన్‌ పితలాటకం

ఉద్యోగుల కేడర్‌ విభజనకు అడ్డంకి

జోన్‌-2లోకి అల్లూరి జిల్లా

జోన్‌-1లోనే ఉమ్మడి విశాఖ జిల్లా

అల్లూరి జిల్లాకు బదిలీ అయితే జూనియర్లే

జిల్లా ప్రాతిపదికగా నియమితులైన ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం

నేటితో బదిలీలకు ఫ్రీజింగ్‌

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు చేరింది. అన్ని శాఖలకు సంబంధించి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులు ఇప్పటికే ఉద్యోగులు/ అధికారుల వివరాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ జాబితాల ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులు, కిందిస్థాయి అఽధికారుల విభజనకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే రాష్ట్రంలో మరే జిల్లాకూ లేని సమస్య ఉమ్మడి విశాఖ జిల్లాకు ఎదురయింది.

గతంలో ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం జోన్‌-1లో ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత పలు అంశాలు అమలుచేసే క్రమంలో రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థలో మార్పులు చేశారు. ఈ క్రమంలో జోన్‌ -1లో ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాను గోదావరి జిల్లాలతో ఉన్న జోన్‌-2 పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఉద్యోగుల విభజనకు ప్రతిబంధకంగా మారింది. సాధారణంగా కిందిస్థాయి ఉద్యోగులు/ ఉపాధ్యాయుల నియామకం జిల్లా ప్రాతిపదికగానే చేపడతారు. జిల్లాలో జూనియర్‌ అసిస్టెంట్‌, ఉపాధ్యాయుడు, క్లాస్‌-4 ఉద్యోగులకు భవిష్యత్తులో పదోన్నతులు జిల్లాలో సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒక జోన్‌లో నియమించిన జూనియర్‌ అసిస్టెంట్‌/ టీచర్‌/ క్లాస్‌-4 సిబ్బందిని మరో జోన్‌కు బదిలీ చేయడానికి సర్వీస్‌ రూల్స్‌ అంగీకరించవు. ఇంకా ఒక జోన్‌లో ఉద్యోగి మరో జోన్‌లోకి వెళితే అత్యంత జూనియర్‌ అవుతాడు. అంటే జోన్‌-1లో జూనియర్‌ అసిస్టెంటును జోన్‌-2కు బదలాయిస్తే.. పదోన్నతుల జాబితాలో చివరవాడిగా పరిగణిస్తారు. ఈ సమస్య అల్లూరి జిల్లాకు కేటాయించే ఉద్యోగులకు వర్తిస్తుంది.

సీనియారిటీ ప్రామాణికం

ఉద్యోగులను త్వరలో మూడు జిల్లాలకు కేటాయించేటప్పుడు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సీనియారిటీ జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు. సీనియర్లు ముందుగా విశాఖ, ఆ తరువాత అనకాపల్లి కోరుకుంటారు. జూనియర్లు మాత్రం అల్లూరి జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జోన్‌-2లో ఉన్న అల్లూరి జిల్లాకు ఉద్యోగులు వెళ్తే అక్కడ పదోన్నతుల విషయంలో తీవ్ర అన్యాయానికి గురవుతారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రం పంపామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కాగా సోమవారం నుంచి రాష్ట్రంలో ఉద్యోగులు, అధికారుల బదిలీలపై ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి రానున్నది. కానీ ప్రస్తుతం ఎన్నికల సంఘం అమలుచేస్తున్న సర్‌ కార్యక్రమంలో రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు నిమగ్నమయ్యారు. సర్‌లో భాగస్వామ్యులైన వారిని బదిలీ చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి అవసరం. రెవెన్యూశాఖలో ఇటీవల డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతులు ఇవ్వడంతో ఆ ఖాళీల్లో సీనియర్‌ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు ఇవ్వాలి. కానీ ఎన్నికల సంఘం ఆంక్షలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగా జిల్లాలకు ఉద్యోగులను కేటాయిస్తే పదోన్నతులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్‌ ప్రక్రియ ముగిసే వరకు విభజన అమలు వాయిదా వేయాలని, జోన్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 12:53 AM