Share News

జోలాపుట్టు జలాశయం తనిఖీ

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:36 PM

మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన జలాశయాన్ని బుధవారం జాతీయ డ్యాం సేఫ్టీ బృందం సభ్యులు తనిఖీ చేశారు.

జోలాపుట్టు జలాశయం తనిఖీ
జోలాపుట్టు జలాశయాన్ని పరిశీలిస్తున్న జాతీయ డ్యాం సేఫ్టీ బృందం సభ్యులు

ప్రస్తుత స్థితిగతులపై సమీక్షించిన జాతీయ డ్యాం సేఫ్టీ బృందం

ముంచంగిపుట్టు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన జలాశయాన్ని బుధవారం జాతీయ డ్యాం సేఫ్టీ బృందం సభ్యులు తనిఖీ చేశారు. పురాతన కాలం నాటి ఈ జలాశయ ప్రస్తుత స్థితిగతులను సమీక్షించడానికి ముగ్గురు సభ్యులు గల బృందం రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కాంపిటెన్సీ డ్యాం సేఫ్టీ ఇవాల్యుయేషన్‌ చైర్మన్‌ కమలేష్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ అత్యంత పురాతన కట్టడాల్లో ఇదొకటి అయినప్పటికీ స్థానిక ఇంజనీర్లు, సిబ్బంది నిర్వహణ బాగానే చేస్తున్నారని కితాబు ఇచ్చారు. అయితే ఇంకాస్త మెరుగులు దిద్దాల్సి ఉందని సూచించారు. జల విద్యుత్‌ కేంద్రాన్ని హెరిటేజ్‌ ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ బృందం గత రెండు రోజులుగా జోలాపుట్టు ప్రధాన జలాశయం వద్ద ఉన్న గేట్లను, సొరంగ మార్గాన్ని, జలాశయం గోడలను, ఇతర యంత్రాల పరితీరును పరిశీలించింది. అలాగే ప్రతీ ఏడాది జలాశయంలో నీటి నిల్వలు ఏ మేరకు వస్తున్నాయి?, నీటి సరఫరా ఎలా జరుగుతుంది?, సరఫరా చేసే సమయంలో ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా?, తదితర అంశాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోలాపుట్టు జలాశయం వద్ద చేపట్టాల్సిన పనులకు సంబంధించిన నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆ బృందం ప్రతినిధులు తెలిపారు. వారి వెంట ఏపీ జెన్‌కో విద్యుత్‌ సౌధ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ (సివిల్‌) షేక్‌ హుస్సేన్‌, ఈఈ (సివిల్‌) కుషుప్రధాన్‌, ఏడీఈ (సివిల్‌) టి.వెంకటమధు, ఏఈలు ఉన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:36 PM