Share News

గంజాయి కట్టడికి సంయుక్త వ్యూహం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:11 AM

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేసిన కూటమి ప్రభుత్వం, పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలోని గంజాయి సాగు నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

గంజాయి కట్టడికి సంయుక్త వ్యూహం
ఏఓబీలో గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న పోలీసులు(ఫైల్‌)

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేసిన కూటమి సర్కార్‌

ఒడిశా నుంచి జిల్లా మీదుగా పెద్ద ఎత్తున గంజాయి రవాణా

దాని కట్టడికి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసుల సమన్వయానికి నిర్ణయం

ఒడిశాలో గంజాయి నియంత్రణకు ఆపరేషన్‌ సంయుక్త పేరిట చర్యలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేసిన కూటమి ప్రభుత్వం, పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలోని గంజాయి సాగు నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా ఊసే లేనప్పటికీ, సరిహద్దు ఒడిశా నుంచి గంజాయి దిగుమతి కావడంతో పాటు రాష్ట్రం మీదుగానే ఇతర ప్రాంతాలకు ఒడిశా గంజాయి రవాణా జరుగుతుండడం కూటమి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. దీంతో సరిహద్దు ఒడిశాలోని గంజాయి సాగు, రవాణాను కట్టడి చేసేందుకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం సూచించింది. ఈ మేరకు తమ రాష్ట్రంలో గంజాయిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఒడిశా పోలీసు యంత్రాంగం అంగీకరించింది.

రాష్ట్రంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో గంజాయి సాగు మరింత అధికమైంది. అక్కడ గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం పెద్దగా చర్యలు చేపట్టకపోవడంతో విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నారు. ఆంధ్రాను ఆనుకుని ఉన్న ఒడిశా భూభాగంలో సుమారుగా 5 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతున్నదని ఒక అంచనా. దీంతో ఒడిశా రాష్ట్రంలో సాగవుతున్న గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతున్నది. అయితే ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయిని రవాణా చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో అల్లూరి జిల్లాకు సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్‌ గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో ఇటీవల కాలంలో ఒడిశాకు చెందిన గంజాయి, స్మగ్లర్లు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలో గంజాయి సాగును అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం.. ఒడిశా ప్రభుత్వాన్ని సైతం కోరింది. ఇందులో భాగంగా విశాఖపట్నం డీఐజీ గోపినాథ్‌జెట్టి ఒడిశాలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో పలుమార్లు సమన్వయ సమావేశాలను నిర్వహించి ఒప్పించారు.

ఉమ్మడి వ్యూహానికి రంగం సిద్ధం

ఒడిశా రాష్ట్రాన్ని సైతం గంజాయి రహితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో భవిష్యత్తులో గంజాయి కట్టడికి ఇరు రాష్ట్రాలు కలిసి అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించి, దానికి ‘ఆపరేషన్‌ సంయుక్త’ అని నామకరణ చేశారు. అలాగే చేపట్టబోయే చర్యలపైనా గత నెల 24న విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసు అధికారులకు అనేక సూచ నలు చేశారు. అలాగే వాళ్లు సైతం ఇరు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం కలిసికట్టుగా ఒడిశాలో గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో సంయుక్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అవి ఏమిటంటే..?

- ఏవోబీలో గంజాయి సాగు నిర్మూలనకు ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ‘ఆపరేషన్‌ సంయుక్త’ ను నిర్వహించాలి.

- గంజాయి రవాణా మార్గాలు, లిక్విడ్‌ గంజాయి తయారీ ప్రాంతాలు, స్మగ్లర్లు, ఇతర కీలక సమాచారాన్ని నిరంతరం ఇరు రాష్ట్రాలు పరస్పరం పంచుకోవడం.

- ఒడిశా రాష్ట్రానికి చెందిన పరారీలో ఉన్న 712 మంది నిందితులు, నాన్‌ బెయిల్‌పై ఉన్న 125 మంది నిందితుల అరెస్టుకు ఆంధ్రా పోలీసు యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరించడం.

- గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తు, ఇతర చర్యలపైనా ఇరు రాష్ట్రాల పోలీసులు కలిసి చట్టపరమైన చర్యలు చేపట్టడం.

- ఆంధ్రా, ఒడిశా సరిహద్దు జిల్లాల్లోని పోలీసు యంత్రాంగాల మధ్య సమన్వయాన్ని మరింత వేగవంతం చేసేందుకు లైజన్‌ అధికారులను నియమించుకోవాలి.

- తక్షణ సమాచార మార్పిడి కోసం సరిహద్దు జిల్లాల్లోని అధికారులతో వాట్సాప్‌ గ్రూప్‌లు, భద్రతతో కూడిన సమాచార మార్పిడి గ్రూపులు ఏర్పాటు చేయడం.

- గంజాయిని శాశఽ్వతంగా నిర్మూలించడాన్ని ఇరు రాష్ట్రాలు తమ సంయుక్త బాధ్యత భావిస్తూ చక్కని సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు.

- పెండింగ్‌ కేసుల దర్యాప్తులు, ఇరు రాష్ట్రాల్లోని కేసులకు సంబంధించిన పరస్పర సహకారాలను కచ్చితంగా అందించుకుని ఏఓబీని గంజాయి రహితం చేయాలని నిర్ణయించారు.

Updated Date - Mar 05 , 2026 | 12:11 AM