Share News

కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ విస్తృత పర్యటన

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:26 PM

కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ అమిత్‌ సంగ్లా జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి, ఆయా ప్రాంతాల్లో గిరిజన రైతుల సాగు పద్ధతులను పరిశీలించారు.

కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ విస్తృత పర్యటన
అరకులోయ మండలం గంజాయిగుడలో ఆర్గానిక్‌ ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ అమిత్‌ సంగ్లా

అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని పంటల పరిశీలన, కేంద్ర పథకాలపై ఆరా

వివిధ శాఖల అధికారులతో కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

నేడు చింతపల్లి మండలంలోని పలు గ్రామాల సందర్శన

పాడేరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ అమిత్‌ సంగ్లా జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి, ఆయా ప్రాంతాల్లో గిరిజన రైతుల సాగు పద్ధతులను పరిశీలించారు. తొలుత ఆయన అరకులోయ మండలం తుడుము గ్రామంలోని ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ను పరిశీలించి, అక్కడ విత్తన ఉత్పత్తి, ఎరువుల తయారీపై ఆరా తీశారు. అలాగే గంజాయిగుడ గ్రామంలో గిరిజన రైతులు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. చినలబుడు గ్రామంలోని కాఫీ తోటలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి గ్రామంలో అవకాడో, అల్లం, మిరప పంటలను పరిశీలించి, సాగు పద్ధతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అరకులోయలో కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితులు, పథకాల అమలు, ఆదాయం, తదితర అంశాలను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌.. కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ అమిత్‌సంగ్లాకు వివరించారు. అరకులోయలో మంగళవారం రాత్రి బస చేసిన ఆయన బుధవారం చింతపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో కేంద్ర పథకాల అమలు, వ్యవసాయ పద్ధతులను పరిశీలించనున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:26 PM