Share News

జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ బదిలీ

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:53 AM

విశాఖపట్నం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ బదిలీ అయ్యారు.

జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ బదిలీ

గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియామకం

కొత్త జేసీగా జి.విద్యాధరి

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ బదిలీ అయ్యారు. ఆయన గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. మయూర్‌ అశోక్‌ స్థానంలో చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి రానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నూతన జేసీగా నియమితులైన విద్యాధరి 2021 బ్యాచ్‌ అధికారిణి. కడప జిల్లాకు చెందిన ఆమె భర్త కొటారి సోమశేఖర్‌ ఐఏఎస్‌ అధికారిగా కేంద్రపాలిత రాష్ట్రాల కేడర్‌లో ఉన్నారు. సోమశేఖర్‌ స్వస్థలం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి. కాగా గుంటూరు మునిసిపల్‌ కమిషనర్‌గా బదిలీ అయిన మయూర్‌ అశోక్‌ 2024 జనవరి 30న విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మయూర్‌ అశోక్‌ సతీమణి, జీసీసీ ఎండీ కల్పనాకుమారి ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

విశాఖలో అనేక విషయాలు నేర్చుకున్నా

మయూర్‌ అశోక్‌

విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌గా అనేక విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ జేసీగా 2024 జనవరి 30న బాధ్యతలు తీసుకున్నాను. తొలుత తెనాలి సబ్‌కలెక్టర్‌గా పనిచేశా. అక్కడ నుంచి 2022లో విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చా. మొత్తం సర్వీస్‌లో నాలుగున్నరేళ్లపాటు ఉత్తరాంధ్రలో ఉన్నా. విశాఖలో భూముల రక్షణతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, లోకాయుక్తలో కేసులు ఉంటాయి. సిట్‌లో కొన్ని భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. ప్రతి ఫైలు పరిశీలన చేసినప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో భూముల సమస్యలు పరిష్కారంలో మంచి అనుభవం వచ్చింది. విశాఖ నగరంతో చక్కని అనుబంధం ఏర్పడింది. రెండేళ్లపాటు విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

విద్యాధరి 2021 బ్యాచ్‌ అధికారిణి

కడప జిల్లా నందలూరు మండలం గొల్లపల్లికి చెందిన విద్యాధరి ఆర్కేవ్యాలీలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ)లో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. ఆర్కే వ్యాలీ ఆర్‌జీయూకేటీ నుంచి సివిల్స్‌కు ఎంపికైన తొలి విద్యార్థి విద్యాధరే. శిక్షణ అనంతరం నెల్లూరు జిల్లాలో 2022 నుంచి 2023 వరకు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ట్రైనింగ్‌ అయ్యారు. ట్రైనింగ్‌ పూర్తయిన తరువాత కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా, కర్నూలు మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2024 ఆగస్టు నుంచి చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.


జీసీసీ ఎండీగా శోభిక

ప్రకాశం జిల్లా జేసీగా కల్పనాకుమారి

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కల్పనాకుమారిని ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె జీసీసీ ఎండీగా 2024 జూలైలో బాధ్యతలు స్వీకరించారు. ఏజెన్సీలో కాఫీ పంటను మరింత విస్తరించడానికి ఆమె కృషిచేశారు. అరకు కాఫీకి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం ప్రయత్నించారు.

ఆమె స్థానంలో జీసీసీ ఎండీగా వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న శోభిక ఎస్‌ఎస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆమె 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. బీఈ చదివారు. స్వస్థలం తమిళనాడు. ఇంతకు ముందు పార్వతీపురం మన్యం జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

Updated Date - Jan 13 , 2026 | 01:53 AM