Share News

జోగంపేట కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:43 AM

మండలంలోని జోగంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.రవికుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ నర్సీపట్నం డీఎల్‌పీవో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకుగల కారణాలను ఎంపీడీవో ఉలబాల శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. జోగంపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి.రవికుమార్‌ స్వగ్రామం రోలుగుంట మండలం బుచ్చెంపేట. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి దాటిన తరువాత అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

 జోగంపేట కార్యదర్శి సస్పెన్షన్‌

మహాశివరాత్రి సందర్భంగా సొంతూరులో పోలీసులపై దాడి

అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు

సర్వీసు నిబంధనల మేరకు సస్పెండ్‌ చేస్తూ డీఎల్‌డీవో ఆదేశాలు

గొలుగొండ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి) మండలంలోని జోగంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.రవికుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ నర్సీపట్నం డీఎల్‌పీవో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకుగల కారణాలను ఎంపీడీవో ఉలబాల శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. జోగంపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి.రవికుమార్‌ స్వగ్రామం రోలుగుంట మండలం బుచ్చెంపేట. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి దాటిన తరువాత అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది కలసి బుచ్చెంపేట వెళ్లారు. ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాలను అనుమతులు లేవని, వెంటనే ఆపేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అయితే స్థానికులు పట్టించుకోకుండా ఎస్‌ఐ, పోలీసులపై దాడికి దిగి, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై రావికమతం మండలం కొత్తకోట సీఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి, నిందితులు బత్తి రవికుమార్‌ (జోగుంపేట పంచాయతీ కార్యదర్శి), గొల్లు కృష్ణ, గుడివాడ ప్రసాద్‌, ఇసంశెట్టి రాజునాయుడు మరికొంత మందిని అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. నిందితుల్లో జోగంపేట పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ కూడా ఉండడంతో నర్సీపట్నం డీఎల్‌పీవో విచారణ జరిపారు. సర్వీసు రూల్స్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా 48 గంటలకు మించి రిమాండ్‌లో వుంటే సదరు ఉద్యోగి సస్పెన్షన్‌కు గురవుతారు. రవికుమార్‌ 14 రోజులపాటు రిమాండ్‌ విధించడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ డీఎల్‌పీవో ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Feb 28 , 2026 | 12:43 AM