వివాహానికి వెళుతున్న జీపు బోల్తా
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:44 PM
మండలంలోని కుడుముసారి పంచాయతీ గడ్డిబంద, కరకపల్లి గ్రామాల మధ్య వివాహానికి వెళుతున్న జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతురాలు భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
అంగన్‌వాడీ కార్యకర్త మృతి
ఐదుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
చింతపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ కురిడేలు గ్రామానికి చెందిన 12 మంది గిరిజనులు ఒడిశా, మల్కన్‌గిరి జిల్లా రోల్లగెడ్డ పంచాయతీ నేరేడుపల్లి గ్రామంలో జరుగుతున్న బంధువుల వివాహానికి జీపులో ప్రయాణమయ్యారు. వర్షం పడడం, మట్టి రోడ్డు కావడంతో జీపు గడ్డిబంద, కరకపల్లి గ్రామాల మధ్యలోని రహదారిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నేరేడుపల్లి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బురిడి కాసులమ్మ(38) సంఘటన స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో బురిడి కాసులమ్మ, బుఠారి పండన్న, బుటారి కళావతి, బచ్చల కోమటరావు, మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రులను లోతుగెడ్డ పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు భర్త త్రిమూర్తులు తీవ్రంగా గాయపడడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.