మారుమూల గ్రామాల్లో జేసీ పర్యటన
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:55 PM
మండలంలోని మారుమూల రొంపల్లి పంచాయతీ బూరిగ, చినకోనెల గ్రామాల్లో జేసీ శ్రీపూజ గురువారం పర్యటించారు. గిరిజనులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
గిరిజనులతో మమేకం
అనంతగిరి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల రొంపల్లి పంచాయతీ బూరిగ, చినకోనెల గ్రామాల్లో జేసీ శ్రీపూజ గురువారం పర్యటించారు. గిరిజనులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 12వ తేదీన మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, బాధిత గిరిజనులు మోకాళ్లపైౖ నిల్చొని నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన జేసీ గురువారం బూరిగ గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శుక్రవారం వీఆర్వో గ్రామానికి వెళ్లి ఎంతమందికి మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలనే దానిపై నివేదికను తహశీల్దార్‌కు అందజేయాలని ఆదేశించారు. వాటిని పరిశీలించి మరణ ధ్రువపత్రాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయా?, లేదా? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం లేదని వారు చెప్పడంతో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇతర సమస్యలు ఉంటే చెప్పాలని గిరిజనులను ఆమె అడిగిన తీరుకు వారు ఎంతో సంతోషించారు. ఇప్పటి వరకు ఏ అధికారి తమ సమస్యలను ఓపికగా విన్న సందర్భం లేదని వారు చెప్పారు. జేసీ వెంట అనంతగిరి తహశీల్దార్ వీరభద్రాచారి, డీటీ మాణిక్యం, వీఆర్వో రాంబాబు, తదితరులు ఉన్నారు.