జయహో అమరావతి
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:59 AM
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్ చేసి మిఠాయిలు పంచారు.
పార్లమెంటులో రాజధాని బిల్లు ఆమోదంతో మిన్నంటిన సంబరాలు
బాణసంచా కాల్పులు, కేక్ కట్టింగులు
మిఠాయిలు పంచిన కూటమి పార్టీల శ్రేణులు
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు
కొవ్వొత్తులు వెలిగించి ఆనందోత్సవాలు
(ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్‌వర్క్)
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్ చేసి మిఠాయిలు పంచారు. పార్టీ జెండాలతోపాటు త్రివర్ణ పతాకాలను చేతబూని బైక్ ర్యాలీలు నిర్వహించారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో కూడా ఉత్సవాలు నిర్వహించారు. ‘మన రాజధాని అమరావతి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరావతి బిల్లును ఆమోదించిన పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా కేంద్రం అనకాపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాలను పట్టుకొని అమరావతికి జై అంటూ నినాదాలు చేశారు. నెహ్రూచౌక్ కూడలి నుంచి చిననాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్‌పటేల్, డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు కొవ్వొత్తులు వెలిగించారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందడం రాష్ట్రాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కె.కోటపాడు మండలం గొండుపాలెంలో కూటమి నాయకులు కాగడాలతో ప్రదర్శన చేశారు. నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్కై లాంతర్లను ఆకాశంలోకి వదిలారు. జై అమరావతి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మునిసిపల్ కార్యాలయం వద్ద జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే విజయ్‌కుమార్ పాల్గొన్నారు. హోం మంత్రి అనిత నక్కపల్లి సమీపంలోని తన నివాసం వద్ద కేక్ కట్ చేశారు. మహిళలతో కలిసి జై అమరావతి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం సారిపల్లివానిపాలెం వద్ద వున్న క్యాంప్ కార్యాలయం నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఎలమంచిలి తులసీనగర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు అమరావతి ప్రాధాన్యతను వివరించేలా ‘అమరావతి- బిల్డింగ్ ది ఫ్యూచర్’, ‘అమరావతి- వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ వంటి నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాయకరావుపేట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలకంరించారు.
కె.కోటపాడు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అధికారులు, ఉద్యోగులు కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. రాజధాని అమరావతి బిల్లుకు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం గొప్ప విషయమని ఎంపీడీవో సాంబశివరావు అన్నారు. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు ముగ్గులు వేసి, దీపాలు వెలిగించారు. మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
చోడవరంలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆధ్వర్యంలో కూటమి నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతపట్టుకుని అమరావతి వర్లిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. రావికమతం మండలం చినపాచిలలో టీడీపీ మండల అధ్యక్షుడు కోమటి శంకరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల వెలిగించి, బాణసంచా కాల్చారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. గొలుగొండలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కేక్‌లు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కోటవురట్ల్ల మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కేక్‌లు కట్‌చేసి ఉత్సవాలు నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.